సంక్షోభంలో ఉన్న రవాణా రంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు.రాష్ట్రంలో రెండు వరుసల రహదారులపై టోలు ప్రతిపాదనలు నిలిపివేయటంతో పాటు లేబర్ సెస్ వసూళ్లు రద్దు చేయాలన్నారు. పెట్రోల్, డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్ను తగ్గించటంతో పాటు జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేస్తామన్న నూతన జరిమానాలను నిలిపివేయాలని ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు.
లారీ యజమానులు, డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని స్పష్టం చేశారు. జగన్ పాలనంతా అప్పులమయం, రోడ్లన్నీ గుంతలమయమని దుయ్యబట్టారు. టోలు పన్నులతో వాహనదారుల తోలు ఒలుస్తున్నారని విమర్శించారు. రోడ్ల మరమ్మతులపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని అనగాని నిలదీశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి రోజుకు వందలాది మంది బలవుతున్నారని మండిపడ్డారు. తెదేపా ప్రభుత్వం డ్రైవర్లను ఓనర్లుగా తీర్చిదిద్దితే, వైకాపా ప్రభుత్వం ఓనర్లను క్లీనర్లుగా మార్చిందని ఎద్దేవా చేశారు. రవాణా రంగాన్ని ఓ పరిశ్రమగా గుర్తించి లారీ యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'సీఎం జగన్.. సింహాచలం అప్పన్న సన్నిధిలో ప్రమాణానికి సిద్దమా..?'