Relief Measures in Flood Areas: గోదావరి వరదల కారణంగా ప్రభావిత జిల్లాల్లో ముంపు బాధితులకు బియ్యం సహా నిత్యావసరాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అల్లూరి జిల్లా, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల్లోని బాధితులకు నిత్యావసరాలు, ఆర్ధిక సాయం అందించాలని సూచనలు జారీ చేసింది.
వరద కారణంగా ఇళ్లు నీటమునిగిన కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటరు పామ్ఆయిల్, కిలో ఉల్లిపాయలు, 1 కేజీ బంగాళ దుంపలు పంపిణీ చేయాలని ఆదేశించింది. ఇళ్లు నీటమునిగి శిబిరాలకు చేరుకున్న వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున కుటుంబానికి 2 వేల రూపాయలు మించకుండా ఆర్థిక సాయం చేయాలని కలెక్టర్లకు సూచనలు జారీ చేసింది.
వరదముంపు కారణంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ పరిహారం ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర విపత్తు సహాయనిధి నుంచి ఈ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు ఉత్తర్వులు ఇస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.
CS review: వర్షాభావ పరిస్థితులు నెలకొన్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆరు జిల్లాల్లోని 130 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని ఆయన వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలు సిద్దం చేయాల్సిందిగా జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
అదే సమయంలో అధిక వర్షంతో వరి నారుమడులు దెబ్బతిన్న రైతులకు స్వల్పకాలిక రకం విత్తనాల సరఫరాకు చర్యలు చేపట్టాల్సిందిగా సూచించారు. రాష్ట్రంలో వరద, కరువు పరిస్థితులపై వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య,ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖల అధికారులతో సమీక్షించారు.
అటు రాష్ట్రంలో పశుగ్రాసం సరఫరాపైనా ఆయన సమీక్షించారు. మరోవైపు ఖరీఫ్ సీజన్లో 34.39 లక్షల హెక్టార్లకు గానూ ఇప్పటి వరకు రైతులు 9.22 లక్షల హెక్టార్లలో సాగు చేశారని అధికారులు వివరించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సాధారణం కంటే 50 శాతం మేర అధిక వర్షపాతం నమోదు అయిందని పేర్కొన్నారు.
అదే విధంగా కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో మైనస్ 20 నుంచి 59 మిల్లీ మీటర్ల తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. వర్షపాతం తక్కువగా పడిన జిల్లాల్లో ప్రత్యామ్నయ పంటలు వేసుకునేందుకు వీలుగా సుమారు 10 వేల క్వింటాళ్ల మినుము, పెసర, కంది, ఉలవ, జొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ తదితర విత్తనాలను ఏపీ సీడ్స్ సిద్ధంగా ఉంచినట్టు తెలిపారు.
Flood Updates: మరోవైపు గోదావరిలో వరద ఉద్ధృతి మరింత పెరుగుతోంది. దీంతో ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 14.70 అడుగుల నీటిమట్టం ఉండగా.. డెల్టా పంట కాల్వలకు 7,100 క్యూసెక్కులు.. సముద్రంలోకి 14.12 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో కూడా క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. జలాశయ క్రస్ట్ గేట్లను వరద తాకింది. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 836 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటినిల్వ 56.29 టీఎంసీలు ఉంది.