జలుబుతో 6 నెలల శిశువు మృతి... ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన - తెనాలిలో ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
జలుబుతో ఆస్పత్రిలో చేర్చిన ఆరు నెలల శిశువును.. మృత దేహంగా అప్పగించారంటూ బంధువులు రోదించారు. బిడ్డకు జ్వరం వచ్చినా వైద్యులు పట్టించుకోలేదని ఆరోపించారు. బాబు మరణాన్ని దాచిపెట్టి.. తప్పించుకోవాలని ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిందీ ఘటన.
గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో.. 6 నెలల శిశువు అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బిడ్డ మరణించిందని బాబు తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేసే వరకు కదిలేది లేదని పట్టుబట్టారు. చిన్నారి మృతి చెందిన విషయాన్ని దాచిపెట్టి వైద్యులు ముఖం చాటేశారంటూ ఆస్పత్రి బయట బైఠాయించారు.
అమర్తలూరు మండలం కోరుతాడిపర్రుకి చెందిన అయ్యప్ప, మౌనిక కుమారుడు అంకమ్మరావు(6 నెలలు).. జలుబుతో బాధపడ్డాడు. శుక్రవారం ఉదయం ఓ ప్రైవేటు పిల్లల వైద్యశాలలో చేర్పించారు. రెండు రోజుల్లో నయమవుతుందని వైద్యులు వివరించారు. అదేరోజు రాత్రి బాబుకి జ్వరం రాగా.. బిడ్డ ఒంటిచుట్టూ అంబులెన్స్ డ్రైవరు తడి గుడ్డ చుట్టి తెల్లవారేసరికి తగ్గిపోతుందని హామీ ఇచ్చాడు. శనివారం మధ్యాహ్నం వరకు శిశువుకి చికిత్స అందిస్తున్న వైద్యులు.. సాయంత్రానికి ఒక్కసారిగా బాబుని వేరే ఆసుపత్రికి తరలించాలి అన్నారు. సీరియస్‌గా ఉంది అంటూ అంబులెన్స్‌ని పిలిపించి గుంటూరు తరలించాలని యత్నించారు. బిడ్డను పరిశీలించిన అంబులెన్స్‌లోని వైద్యులు.. అప్పటికే శిశువు మరణించినట్లు ధ్రువీకరించారంటూ శిశువు కుటుంబ సభ్యులు విలపించారు.
ఇదీ చదవండి:
గుళ్లపల్లిని వరించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్వశక్తి పురస్కార్