గుంటూరు జిల్లాలో నాగార్జునసాగర్‌తో పాటు ప్రకాశం బ్యారేజీ ఆయకట్టు కింద సుమారు 2లక్షల హెక్టార్లలో వరి సాగవుతోంది. చీడపీడలతో పాటు ఈసారి ఎలుకల బెడద కూడా రైతులకు ఇబ్బందిగా మారింది. పొలం గట్ల వెంబడి బొరియల్లో దాగిన ఎలుకలు పంటలను పాడు చేస్తున్నాయి. ప్రస్తుతానికి వరికంకులు చిరుపొట్ట దశలో ఉన్నాయి. ఇంతటి కీలకమైన సమయంలో ఎలుకలు విజృంభించి పంటను నాశనం చేస్తున్నాయి. రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఇదే సమయంలో ఎలుకల నివారణకు డిమాండ్ పెరిగింది. ఒక్కో ఎలుకను పట్టుకున్నందుకు 30నుంచి 50 రూపాయల వరకూ చెల్లించాల్సి వస్తోంది. పంట పెట్టుబడులకు తోడు.. ఈ ఖర్చులు తమకు అదనంగా మారాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రబీ సీజన్ జొన్న, మొక్కజొన్న పంటల కారణంగా ఎలుకల సంఖ్య పెరిగినట్లు రైతులు చెబుతున్నారు. ఆ కంకులను ఆహారంగా తీసుకుని విపరీతంగా వృద్ధి చెందాయని.. ప్రస్తుతం వరిపైనా ప్రతాపం చూపుతున్నాయని చెబుతున్నారు.
వరదల సమయంలోనూ ఎలుకలు విపరీతంగా సంతానోత్పత్తి చేశాయి. మూషికాల తాకిడి పెరిగిపోవటంతో పంట గుల్లయిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడిగినంత ఇవ్వకపోతే వాటిని పట్టుకునేవారు రావటం లేదని చెబుతున్నారు. బుట్టల ద్వారా ఎలుకలు పడితే 30 రూపాయలు, పొగద్వారా అయితే 50 రూపాయలు చెల్లించుకోవాల్సి వస్తోంది.
ఏటా వ్యవసాయశాఖ తరపున ఎలుకల సామూహిక నివారణ కార్యక్రమం నిర్వహిస్తారు. అన్నిచోట్లా ఒకేసారి ఈ ప్రక్రియ చేపట్టినా... ఆశించిన లక్ష్యం నెరవేరలేదు. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి: