ఓ వివాహితపై ముగ్గురు యువకులు సామూహికంగా అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత మహిళ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకొచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన వివాహిత ఓ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సంస్థలో పనిచేస్తోంది. ఆమె కొద్ది రోజుల క్రితం విజయవాడ నుంచి స్కూటీపై వస్తున్నపుడు ఓ యువకుడికి లిఫ్ట్ ఇచ్చింది. అలా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. దూరవిద్య కోర్సుల ద్వారా విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలు ఇప్పిస్తానని ఆమె ఆ యువకుడితో చెప్పింది.
ఈ నేపథ్యంలో ఆమెను ఆ యువకుడు ఓ నిర్జన ప్రదేశానికి ఈనెల 15న తీసుకొచ్చాడు. తన స్నేహితులకు ధ్రువీకరణ పత్రాలు కావాలని, ముగ్గురికీ కలిపి ఇప్పించాలని నమ్మించాడు. అక్కడకు వెళ్లిన తర్వాత ముగ్గురు యువకులు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జరిగిన ఘటనను బయటకు చెబితే చంపేస్తామని ఆమెను బెదిరించి వెళ్లిపోయారు. ఆ తరువాత ఆ వివాహిత వెళ్లిపోయింది. జరిగిన ఘటనపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: ఈ వీడియో చూస్తే రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉంటారు!