MP GVL Narasimha Rao comments: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రాజీనామా చేసిన అనంతరం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఘాటుగా స్పందించారు. బీజేపీలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు సముచిత గౌరవం ఇచ్చామని, రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగాను పార్టీ అధిష్ఠానం నియమించిందన్నారు.
విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో రంగ-రాధ అభిమాన సంఘం ప్రతినిధులతో జీవీఎల్ నరసింహారావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం వంగవీటి రంగ విగ్రహానికి పూలమాలలు వేసి మీడియాతో మాట్లాడారు. కన్నా వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశమైనవని అన్నారు. సోము వీర్రాజు తీసుకున్న నిర్ణయాలన్నీ కేంద్ర పార్టీ అనుమతితో చేసినవేనని, పార్టీలో పదవుల నుంచి ఎవరిని తొలగించినా, నియమించాలన్నా అవి ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు కావని స్పష్టతనిచ్చారు.
తనపై కన్నా చేసిన వ్యాఖ్యలపై స్పందించబోనని జీవీఎల్ తెలిపారు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉన్నాయని, ఎంపీగా తనకు ఉన్న అవకాశాల మేరకు తాను పని చేస్తానని వివరించారు. బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి అత్యున్నతమైందని, ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి పార్టీలో అధ్యక్ష పదవి ఇచ్చిన సందర్భం అత్యంత అరుదైనదని ఆయన గుర్తు చేశారు. కన్నాకు బీజేపీ అలాంటి అవకాశం ఇచ్చిందని, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కూడా పూర్తి స్థాయి గౌరవాన్ని కలిపించిందని తెలిపారు.
బీజేపీలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు సముచిత గౌరవం ఇచ్చాం.. రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగాను పార్టీ అధిష్ఠానం నియమించింది.. కన్నా వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశమైనవి. సోము వీర్రాజు తీసుకున్న నిర్ణయాలన్నీ కేంద్ర పార్టీ అనుమతితో చేసినవే -జీవీఎల్
అనంతరం రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు వంగవీటి రంగా పేరును కృష్ణా జిల్లాకు పెట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పార్టీ కార్యకర్తలు ముందుకు రావాలని జీవీఎల్ నరసింహారావు పిలుపునిచ్చారు. రంగా వ్యక్తిత్వం గురించి బడుగు, బలహీనవర్గాల సేవల గురించి తాను పార్లమెంట్‌లో ప్రస్తావించానన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇద్దరి పేర్లేనా? మిగిలినవారి పేర్లు ప్రభుత్వానికి కనిపించవా? అని ప్రశ్నించారు.
రంగా పేరు ఏదో జిల్లాకు పెట్టాలన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సబ్ కా విశ్వాస్' అనే నినాదంతో అందర్ని గౌరవించుకోవాలన్నారు. పార్లమెంటులో రంగా గురించి ప్రస్తావించి, జిల్లా ఏర్పాటుకు డిమాండ్ చేసినందుకు రంగ-రాధ అభిమాన సంఘం ప్రతినిధుల జీవీఎల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తాళ్లపాలేనికి చెందిన బుజ్జి తన సొంత ఖర్చులతో 99 రంగా విగ్రహాలు ఏర్పాటు చేసినందుకు జీవీఎల్ సత్కరించారు. త్వరలో రంగ-రాధ అభిమానులు విజయవాడలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఇవీ చదవండి