Rahul Gandhi Comments at Jodo Yatra: భాజపా పాలన నుంచి దేశాన్ని రక్షించే ఉద్దేశంతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర చివరిరోజు రాష్ట్రంలో ఉత్సాహంగా కొనసాగింది. ఈ క్రమంలో సాయంత్రం కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలోని మేనూరులో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో రాహుల్ గాంధీ తనదైన శైలిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శనాస్త్రాలు సంధించారు.
మోదీ, కేసీఆర్ కలిసే పని చేస్తారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. మోదీ చేసే ప్రతి చట్టానికి పార్లమెంటులో కేసీఆర్ మద్దతిస్తారని ఆరోపించారు. ఒకవైపు మోదీ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తుంటే... మరోవైపు కేసీఆర్ ప్రాజెక్టుల ద్వారా కమీషన్లు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ నోట్ల రద్దుతో రైతులు, ప్రజల జీవితాన్ని దెబ్బతీశారని రాహుల్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలిపారు. ప్రతి పంటకు మద్దతు ధర అందిస్తామని పేర్కొన్నారు.
ఎదురుదెబ్బలు తగిలినా పోరాటం ఆపని ధీరోదాత్తులు తెలంగాణ ప్రజలు : 10, 12 రోజులుగా తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నామన్న రాహుల్ గాంధీ.. ఈరోజు తెలంగాణ నుంచి మహారాష్ట్రలో ప్రవేశిస్తున్నామని తెలిపారు. తెలంగాణను విడిచిపెట్టి వెళ్తున్నందుకు బాధగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఎదురుదెబ్బలు తగిలినా పోరాటం ఆపని ధీరోదాత్తులు తెలంగాణ ప్రజలన్న రాహుల్ గాంధీ... తెలంగాణ వాసుల మాట విని తీరాల్సిందే అని వ్యాఖ్యానించారు. ఇక్కడి ప్రజలది ఎదురొడ్డి పోరాడే నైజమని ఆయన కొనియాడారు.
'నా పాదయాత్రలో పాల్గొనేందుకు ఓ పిల్లవాడు వచ్చాడు. పలుమార్లు పోలీసులు అడ్డుకున్నా వెనుదిరగలేదు. కిందపడి దెబ్బతగిలినా వెనుకడుగు వేయలేదు. నా దగ్గరకు వచ్చి ఏమీ అడగకుండా నాతో పాటే పాదయాత్ర చేశాడు. అతని చర్యను ముందు నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఆశ్చర్యం వేసి మీ నాన్నగారు ఎక్కడా అని అడిగాను. అనారోగ్యంతో రాలేదని ఆ పిల్లవాడు సమాధానమిచ్చాడు. పిల్లవాడి తండ్రితో ఫోనులో మాట్లాడాను. నాతో పాదయాత్ర చేయాలనే సంకల్పం మాత్రమే పిల్లవాడిలో ఉంది. నిస్వార్థంగా వచ్చి నాతో నడిచిన ఆ పిల్లవాడి చైతన్యం నన్ను కట్టిపడేసింది. అందుకే తెలంగాణ చైతన్యవంతమైన భూమి. ఇక్కడి ప్రజలది ఎదురొడ్డి పోరాడే నైజమని అంటున్నా.'-రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అగ్రనేత
ఇవాళ్టితో తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ముగిసింది. మెనూరులో బహిరంగ సభ అనంతరం జోడోయాత్ర మహరాష్ట్రలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో జాతీయ పతాకాన్ని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మహరాష్ట్ర పీసీసీ అధ్యక్షునికి అందించనున్నారు. మొత్తం 12 రోజుల పాటు మక్తల్ నుంచి మద్నూరు వరకు రాష్ట్రంలో రాహుల్ గాంధీ 375 కిలోమీటర్లు భారత్ జోడోయాత్ర చేశారు. ప్రతిరోజు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ జోడోయాత్రను ముగించారు.
ఇవీ చదవండి: