Protests Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ.. జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్లు నల్ల కండువాలతో నేలపై బైఠాయించి.. నిరసన తెలిపారు. మేము సైతం చంద్రబాబు కోసమంటూ నందిగామలో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం వద్దనున్న కృష్ణా గోదావరి నదుల సంగమమైన ఫెర్రీ ఘాట్ వద్ద మాజీ మంత్రి దేవినేని ఉమా.. కౌన్సిలర్లు, కార్యకర్తలతో జలదీక్ష చేశారు.
బాపట్ల జిల్లా చీరాలలో టీడీపీ శ్రేణులు వినూత్న రీతిలో అర్ధనగ్నంగా నిరసన దీక్ష చేపట్టారు. అరాచక పాలన ముగిసే రోజులు దగ్గర పడ్డాయని మండిపడ్డారు. చంద్రబాబు త్వరగా బయటకు రావాలంటూ.. రేపల్లె టీడీపీ కార్యాలయం వద్ద హోమం నిర్వహించారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ సభ్యులు.. నోటికి నల్లగుడ్డ కట్టుకుని ప్లకార్డులు ప్రదర్శించారు.
చంద్రబాబు త్వరగా జైలు నుంచి విడుదలవ్వాలంటూ కోరుతూ..తిరుపతి జిల్లా తొండమాన్‌పురంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రేణులు పొర్లు దండాలు పెట్టారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో వార్డు సభ్యులు, సర్పంచులు రిలే నిరాహార దీక్షలు చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని దీక్షా శిబిరం వద్ద శ్రేణులు.. ఐ యామ్ విత్ సీబీఎన్ ఆకారంలో రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు.
అనంతపురం జిల్లా ఉరవకొండలో.. దీక్షా శిబిరం నుంచి క్లాక్ టవర్ వరకు మహిళలు.. ర్యాలీ నిర్వహించారు. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. పెద్దపప్పూరు మండలం తిమ్మనచెరువు లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ర్యాలీగా వెళ్లి.. ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ ముందు కళ్లకు గంతలు కట్టుకోగా, హిందూపురంలో మెడకు ఉరితాళ్లతో కదిరిలో కుమ్మరి సంఘాల నేతలు.. కుండలు తయారు చేస్తూ.. వినూత్న నిరసన తెలిపారు.
పెనుకొండ అంబేడ్కర్ కూడలిలో చేతికి సంకెళ్లు వేసుకుని.. ఆందోళన చేశారు. కొత్తపల్లి నుంచి వినుకొండ బాబయ్య దర్గా వరకు నిర్వహించిన 25 కిలోమీటర్ల పాదయాత్రకు.. మాజీ మంత్రి పరిటాల సునీత సంఘీభావం తెలిపారు. హిందూపురం కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్లు.. నల్ల దుస్తులు ధరించి.. ప్లకార్డులతో నిరసన తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకు.. దీక్షా శిబిరం వద్ద కల్లుగీత కార్మికులు కల్లు కుండలు, తాడిచెట్టు ఎక్కే బల్లలతో నిరసన తెలిపారు. కోనసీమ జిల్లా రావులపాలెంలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో 18వ రోజు రిలేట్ దీక్షలు కొనసాగుతున్నాయి. కొత్తపేట మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళలు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. నిరంకుశ పాలన అక్రమ అరెస్టులతో తలకిందులైన రాష్ట్రం అంటూ ప్రకార్డులు పట్టుకుని వినూత్నంగా శీర్షాసనం వేసి నిరసన వ్యక్తం చేశారు.
చంద్రబాబు త్వరగా బయటకు రావాలంటూ.. విశాఖ తూర్పు నియోజకవర్గం ఆరిలోవలోని దీక్షా శిబిరం వద్ద సర్వమత ప్రార్థనలు చేశారు. విజయనగరం జిల్లా.. బొబ్బిలి పురపాలక కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్లు.. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసరిలే నిరాహారదీక్షలో ఎంపీ రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.