Political Leaders Reaction on Punganur Incident: చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరులో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ‘ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పర్యటనలో భాగంగా అంగళ్లు నుంచి పుంగనూరు బయల్దేరిన చంద్రబాబును అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు విశ్వప్రయత్నం చేశాయి. అంగళ్లులో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్తలపై రాళ్లు, కర్రలతో దాడికి తెగబడ్డారు. పుంగనూరు వద్ద రహదారికి అడ్డంగా లారీ, వాహనాలు అడ్డుపెట్టారు. పుంగనూరు వెళ్లేందుకు చంద్రబాబుకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్తలపైకి రాళ్లు విసరడంతో.. చాలా మందికి గాయాలయ్యాయి. పర్యటనలో అడుగడుగునా అవాంతరాలు సృష్టించారు. అంగళ్లులో తెలుగుదేశం బ్యానర్లు వైసీపీ శ్రేణులు చించివేయడంతో.. ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈ ఘటపై పలువురు రాజకీయ నేతలు స్పందించారు.
ALSO READ: ఈ రోడ్డు మీ తాత జాగీరా.. పుంగనూరుకు మళ్లీ వస్తా: చంద్రబాబు
Janasena chief Pawan Kalyan: పుంగనూరు ఘటనను ప్రజాస్వామ్య వాదులు ఖండించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రతిపక్షం గొంతు నొక్కేలా వైసీపీ సర్కారు వైఖరి ఉందని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ దాడులకు పాల్పడుతోందన్నారు. దాడులు అధికార పార్టీ హింసా ప్రవృత్తిని తెలియజేస్తోందన్నారు.
BJP state president Daggubati Purandeshwari: పుంగనూరులో తెలుగుదేశం అధినేత పర్యటనలో జరిగిన ఘటనను భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఖండించారు. ప్రతిపక్ష నేత పర్యటనలో జరిగిన సంఘటన శోచనీయం అని వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలు పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యానికి ఈ సంఘటన సాక్షిగా పేర్కొనవచ్చని అన్నారు. ఈ తరహా ఘటన లు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం పని చేయాలని పురందేశ్వరి హితవు పలికారు.
CPI State Secretary K Ramakrishna: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై వైసీపీ శ్రేణులు రాళ్లదాడి చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.. చంద్రబాబు వస్తున్న మార్గంలో భీమగానిపల్లి వద్ద ప్రధాన రహదారిపై కంటైనర్ లారీ, వాహనాలను అడ్డుపెట్టి చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని చూడడం పోలీసులు విపరీత చర్యలకు తార్కాణమని అన్నారు. అడ్డుగా ఉన్న లారీని తొలగించాలని ఆందోళన చేపట్టిన టీడీపీ కార్యకర్తలపై పోలీసుల దుందుడుకు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక ప్రతిపక్షాలపై దాడులు, వేధింపులు పెరిగిపోయాయని అన్నారు.
ALSO READ: రావణకాష్టంలా పుంగనూరు.. చంద్రబాబును అడ్డుకునేందుకు పోలీసుల యత్నం
శాంతియుత ఉద్యమాలపై పోలీసులను ప్రయోగించి ఉక్కుపాదం మోపుతున్నారన్నారు. పోలీసులు కూడా తమ బాధ్యత మరచి, అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ ప్రజాస్వామిక హక్కులకు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కాన్వాయ్‌పై దాడికి పాల్పడ్డ వైసీపీ శ్రేణులను గుర్తించి, తక్షణమే అరెస్టుచేసి కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
ALSO READ: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ శ్రేణుల విధ్వంసం.. భగ్గుమన్న టీడీపీ నాయకులు