Petition in High Court on YCP Political Programme: వైసీపీ చేపట్టిన ‘ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలంటే’ రాజకీయ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొనకుండా నిలువరించాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ కార్యక్రమానికి ప్రజాధనాన్ని వినియోగించకుండా అడ్డుకోవాలని కోరుతూ మంగళగిరికి చెందిన జర్నలిస్ట్ కట్టెపోగు వెంకయ్య ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్న అధికారులపై, సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ ప్రత్యేక సీఎస్, పంచాయతీరాజ్, పురపాలకశాఖ, గ్రామ, వార్డు, సచివాలయాలు, వాలెంటీర్‌శాఖ ముఖ్యకార్యదర్శులు, కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి, వ్యక్తిగత హోదాలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రతివాదులుగా పేర్కొన్నారు.
'ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టారు, ఆధారాలు మాయం చేశారు' - సీఎం జగన్, సజ్జల సహా 41మందికి నోటీసులు
రాజకీయ లబ్ధి కోసం అధికార పార్టీ వైసీపీ.. జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని చేపట్టిందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సొమ్ము ఖర్చుచేయకుండా అడ్డుకోవాలన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి.. ఈ కార్యక్రమాన్ని వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారన్నారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు వైోసీపీతో కలిసి పనిచేయాలని బహిరంగంగా ప్రకటించారన్నారు. వైసీపీ రాజకీయ ప్రయోజనం పొందడం కోసం ప్రజాధనాన్ని వినియోగించి 24 పేజీల బుక్‌లెట్‌ను ముద్రించి పంచిపెట్టారని పిటీషన్లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీకి ఓటు వేసేలా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ప్రభావితం చేస్తున్నారన్నారు. గ్రామాలలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు పంచాయతీరాజ్‌శాఖకు చెందిన కార్యనిర్వహణ అధికారిని, పట్టణాలలో అదనపు కమిషనర్లను ‘నోడల్ ఆఫీసర్లు’గా పేర్కొన్నారన్నారు.
ఈ నెల 9తో మొదలైన ఈ కార్యక్రమం డిసెంబర్ 19తో ముగుస్తుందన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ విషయంలో జీవో, సర్క్యులర్, మెమోకాని జారీచేయలేదన్నారు. అయితే సీవిల్ సర్వీసు కాండక్ట్ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను రాజకీయ కార్యక్రమం కోసం వినియోగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కీర్తించడానికి రూ.10 కోట్లు ఖర్చుచేస్తున్నారన్నారు. ఇలాంటి చర్య రాజ్యాంగ, చట్ట నిబంధనలకు విరుద్ధమని పిటీషనర్ పెర్కొన్నారు. యంత్రాగాన్ని వినియోగించేటట్లు కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వాలెంటీర్లు ఈ కార్యక్రమాలలో పాల్గొని వైసీపీ జెండాలను ఎగురవేస్తున్నారన్నారు.
జడ్జిలను దూషించారన్న పిటిషన్‌పై హైకోర్ట్ విచారణ - ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశం
ప్రభుత్వం, వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. కార్యక్రమంలో పాల్గొనని ప్రభుత్వ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీచేస్తున్నారన్నారు. కొంతమంది అధికారులపైన చర్యలు తీసుకున్నారన్నారు. దీనినిబట్టి చూస్తే రాజకీయ కార్యక్రమంలో పాల్గొనేలా అధికారులను ఒత్తిడి చేస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు. సెంట్రల్ సివిల్ సర్వీస్ (కాండక్ట్) రూల్3(1) ప్రకారం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి రాజకీయ తటస్థ కలిగిఉండాలన్నారు. రూల్ 5(1)ప్రకారం ఏ రాజకీయ పార్టీతో అనుబంధం ఉండకూడదన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను ‘ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలంటే’ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనకుండా నిలువరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చుచేయకుండా అడ్డుకోవాలని పిటీషనర్ అభ్యర్థించారు.