కృష్ణా నదికి వరద నీరు పోటెత్తటంతో గుంటూరు జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులన్నీ పొంగిపొర్లుతుండటంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు తాడేపల్లి మండలంలో కరకట్టను కృష్ణా నది వరద తాకుతోంది. ఉద్ధృతికి మండలంలోని 2 వేల ఎకరాల్లో వాణిజ్యపంటలు నీటమునిగాయి.
అమరావతి, బెల్లంకొండ, అచ్చంపేట మండలాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. వరద ఉద్ధృతికి 15 వేల ఎకరాల్లోని పంట నీటమునిగింది. పెద్దమద్దూరు వద్ద వాగు ప్రవాహంతో రాకపోకలు స్తంభించాయి. విజయవాడ-అమరావతి మధ్య నాలుగోరోజు రాకపోకలు నిలిచిపోయాయి. మునుగోడు వద్ద నక్కవాగు ఉద్ధృతితో క్రోసూరు-అచ్చంపేట మధ్య రవాణా ఆగింది. అలాగే అమరావతి అమరేశ్వరాలయం వద్ద నదిలోని నీటిమట్టం పెరుగుతోంది. ఆలయం వద్ద ఉన్న పార్కింగ్ ప్రదేశానికి వరదనీరు వచ్చిచేరింది. ధ్యానబుద్ధ ప్రాజెక్టు వద్ద పార్కు నిర్మించే ప్రదేశానికి నీరు చేరింది. బెల్లంకొండ మండలం పాపాయపాలెం వద్ద పిల్లేరు వాగు ఉద్ధృతితో మోర్జంపాడు-పాపాయపాలెం మధ్య నిలిచిన రాకపోకలు జరగటం లేదు. అచ్చంపేట మండలం మాదిపాడు... అమరావతి మండలం ధరణికోట, మల్లాది, మునుగోడులో ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
కొల్లూరు, కొల్లిపొర మండలాల పరిధిలోని 15 గ్రామాల్లోకి వరదనీరు వచ్చింది. అరవిందవారధి వద్ద గండి కారణంగా కృష్ణా కరకట్ట వరకు నీరు చేరింది. లంక గ్రామాలు పూర్తిగా జలదిగ్బందంలో చిక్కున్నాయి. ఇళ్లు వదిలి వచ్చేందుకు లంక గ్రామాల ప్రజల నిరాకరిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలను మాత్రం సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. విద్యుత్ స్తంభాలు నీటమునిగిన కారణంగా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.