Buffalos in Village Secretariat: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఏటుకూరులో వార్డు సచివాలయ సిబ్బంది వింత పరిష్కారం.. వినూత్న నిరసనకు దారి తీసింది. తమ పక్కింటి నుంచి వస్తున్న గేదెల వాసనతో ఇంట్లో ఉండడం కష్టమవుతోందంటూ.. స్పందన కార్యక్రమంలో భాగంగా ఓ వ్యక్తి ఏడాదిగా ఫిర్యాదులు ఇస్తూనే ఉన్నాడు. వరుస అర్జీలతో గేదెల యజమాని బూరగడ్డ శ్రీనివాస్‌కు సచివాలయ సిబ్బంది నోటీసులిచ్చారు. సమాధానం రాకపోవడం వల్ల.. శానిటరీ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు.. శ్రీనివాస్‌కు చెందిన గేదెలను తీసుకొచ్చి గ్రామ సచివాలయ ప్రాంగణంలో కట్టేశాడు. దూడల్ని మాత్రం అతని ఇంట్లోనే వదిలేశారు. అర్జీని పరిష్కరించకపోతే పై అధికారులు తమను సస్పెండ్ చేస్తారంటూ.. పాలు కావాలంటే సచివాలయానికే వచ్చి తీసుకెళ్లొచ్చని చెప్పారు.. అంతవరకూ సరేలే అనుకున్నా.. తీసుకెళ్లిన గేదెలకు రోజంతా సిబ్బంది మేత వేయకపోవడంతో ఆగ్రహం తెచ్చుకున్న యజమాని నిరసన చేపట్టాడు.
Villagers Protest with buffalos: శ్రీనివాస్ నిరసనకు మద్దతుగా.. స్థానికులు తమ గేదెలతో కార్యాలయాన్ని ముట్టడించారు. నోరు లేని జీవులపై ఇంత కఠినంగా వ్యవహరిస్తారా అంటూ గ్రామస్థులు మండిపడ్డారు. స్థానిక సమస్యలపై ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించని సిబ్బంది.. పాలు ఇచ్చే గేదెలపై ఇలా వ్యవహరించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం, నీటి సరఫరాపై దృష్టి సారించకుండా.. ఫిర్యాదుదారుడు ఇచ్చే లంచాల కోసం ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడం ఏంటని ప్రశ్నించారు. గ్రామస్థుల ఆందోళనతో మెట్టు దిగిన నగరపాలక సంస్థ అధికారులు.. కట్టేసిన గేదెలను వదిలిపెట్టారు. అధికారుల చర్యలతో శాంతించిన గ్రామస్థులు.. ఆందోళన విరమించారు.
ఇవీ చదవండి: