ఇతర రాష్ట్రాల నుంచి తరచూ మద్యం అక్రమ రవాణా చేస్తున్న గుంటూరు జిల్లా కారుమంచికి చెందిన రామ కోటేశ్వరరావు అనే వ్యక్తిపై పోలీసులు, సెబ్ అధికారులు పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. గుంటూరు జిల్లాలో అక్రమ మద్యం రవాణాకు సంబంధించి తొలిసారి పీడీ యాక్టు అమలు చేశారు. పీడీ యాక్టు అమలుకు సంబంధించి ప్రభుత్వం.. జీవో 1155ను జారీ చేసింది. వివిధ రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా చేస్తుండగా ఇప్పటివరకు మూడు కేసుల్లో రామకోటేశ్వరరావు పట్టుబడ్డారు.
అరెస్టు వివరాలను గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, సెబ్ అధికారులు మీడియా సమావేశంలో వివరించారు. నడికుడి నుంచి పొందుగుల వెళ్లే దారిలో నిందితుడిని అరెస్టు చేశామని.. అనంతరం అతన్ని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించినట్లు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ చెప్పారు. జిల్లాలో అక్రమమద్యం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు తరచూ పాల్పడితే పీడీ యాక్టు కింద కేసులు తప్పవని ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు.