తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజధాని పనులు అడ్డుకునేందుకు 295 కేసులు వేసిన మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణ... మరో 5 కేసులు కూడా వేసి త్రిపుల్ సెంచరీ సాధించినా ఆశ్చర్యపోనవసరం లేదని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ విమర్శించారు. కృష్ణానది కరకట్టపై ఆర్కే దందా జరుగుతోందని ఓ ప్రకటనలో దుయ్యబట్టారు. మూడేళ్ల నుంచి కరకట్టకే పరిమితమైన ఆర్‌కే (రామకృష్ణ)... మంత్రి పదవి రానందున అక్రమాల పేరుతో వసూళ్లకు తెర తీశారని ఆరోపించారు.
మంగళగిరి నియోజకవర్గంలో పెట్టుబడులు పెట్టిన వారిని బెదిరిస్తున్నారని విమర్శించారు. ఆర్...అంటే రౌడీయిజం...కే... అంటే కరకట్ట అన్నట్లుగా ఎమ్మెల్యే వ్యవహారం ఉందని దుయ్యబట్టారు. చేతగాని పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చే యత్నాలు చేస్తున్నారన్నారు. సమస్యలు పరిష్కరించలేక వివాదాల పేరుతో ఎమ్మెల్యే కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. రాజధాని పనులపై తమ ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పని రామకృష్ణారెడ్డి అమరావతికి అనుకూలమా? వ‌్యతిరేకమా అన్నది చెప్పాలని డిమాండ్ చేశారు.