TDP Ready for MLC Eections with Left Parties: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు అవకాశం ఉన్న ఏ అవకాశం జారవిడుచుకోకూడదని తెలుగుదేశం, వామపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఐక్య కార్యాచరణతో ముందుకు సాగాలని నిర్ణయించాయి. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు తమ అభ్యర్థులకు, రెండో ప్రాధాన్యత పీడీఎఫ్ అభ్యర్థులకు వేయాలని తెలుగుదేశం నిర్ణయించింది. తమ రెండో ప్రాధాన్యత ఓటు తెలుగుదేశం అభ్యర్థులకు వేసేందుకు వామపక్షాలు పరస్పర అవగాహనకు వచ్చాయి.
ప్రకాశం - నెల్లూరు - చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గం, కడప-అనంతపురం - కర్నూలు పట్టభద్రుల నియోకజవర్గం, శ్రీకాకుళం - విజయనగరం - విశాఖ పట్టభద్రుల నియోకజవర్గంలో టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తూర్పు రాయలసీమ పరిధిలోని 2 ఉపాధ్యాయ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. నిరుద్యోగ, ఉద్యోగ వ్యతిరేక వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఓడించి రాష్ట్రాన్ని కాపాడుకుందామని టీడీపీ వామపక్షాలు పిలుపునిచ్చాయి.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధను దింపాలని తెలుగుదేశం నిర్ణయానికి వచ్చింది. శాసనసభలో ఎమ్మెల్యేల బలాబలాలను బట్టి జరిగే ఈ ఎన్నికలో టీడీపీ అభ్యర్థిని దింపనుండటంతో రాజకీయం రసవత్తరంగా మారనుంది. ఒక్కో అభ్యర్థి గెలుపు కోసం దాదాపు 22- 23 మొదటి ప్రాధాన్యం ఓట్లు కావాల్సి ఉండగా.. రెండవ ప్రాధాన్యం ఓట్లు కీలకం కానున్నాయి.
టీడీపీ తరపున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలగిరి, వాసుపల్లి గణేష్‌లు వైఎస్సార్సీపీలో చేరినా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయలేదు. అటు అధికార పార్టీని ఎమ్మెల్యేల అసమ్మతి సెగ వేధిస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికలపై ఆసక్తిని రేకెత్తిస్తుంది.
మరోవైపు ఈ ఎన్నికల్లో బోగస్ ఓట్లను తెలుగుదేశం సీరియస్‌గా తీసుకుంది. వైఎస్సార్సీపీ పాలనలో ఎన్నికల ప్రక్రియ ఓ ప్రహసనంగా మారిందంటూ వర్ల రామయ్య సీఈసీ ముకేశ్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు. తిరుపతి నియోజకవర్గంలో దొంగ ఓటర్లు, నకిలీ సర్టిఫికెట్లపై సంతకాలు చేసిన అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీకి సహకరించిన అధికారులపై న్యాయపొరాటం చేస్తామన్నారు.
"విద్యావంతుల ఓట్లు కూడా కొనుగోలు చేసి.. సంతలో పశువుల్లా వాళ్లని మార్చడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఈ చర్యలకు ముఖ్యమంత్రి గారు సిగ్గుపడాలి. పీడీఎఫ్ అభ్యర్థులకు.. మొదటి ప్రాధాన్యత ఓటు వేయమని కోరుతున్నాం. రెండో ప్రాధాన్యత ఓటు తెలుగుదేశం అభ్యర్థులకు వేయమని కోరుతున్నాం". - రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
"తిరుపతి పట్టణంలోనే 7 వేలు పైచిలుకు దొంగ ఓట్లు ఉంటే.. ఇదెక్కడి ఎలక్షన్ అండీ. ఒకే డోర్ నెంబర్లో 48 ఓట్లు ఉన్నాయి. నేను వాళ్లకి ఫోన్ చేసి అడిగితే.. ఆవిడ పదో తరగతి ఫెయిల్ అయ్యాను అని చెప్తోంది. టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వారికి పట్టభద్రుల ఓటు ఎలా వస్తుంది. ఇది జగన్ రెడ్డి మార్క్ ఎలక్షన్స్". - వర్ల రామయ్య, టీడీపీ సీనియర్ నేత
ఇవీ చదవండి: