గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి రైల్వే గేట్ వద్ద సత్తిళ్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి రైలు ఢీకొని మరణించిన ఘటన చోటు చేసుకుంది. తెదేపా సానుభూతి పరుడు సత్తిళ్ల శ్రీనివాస రావు ఈ నెల 8న జరిగిన పరిషత్ ఎన్నికల్లో వైకాపా నేతలతో వాగ్వాదానికి దిగారు. ఫలితంగా వైకాపా నాయకులు పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు శ్రీనివాసరావు ఇంటికి విచారణ నిమిత్తం వచ్చారు. ఆ సమయంలో అతను లేకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు.
మనస్థాపంతోనే..
ఈ ఘటనతో మనస్థాపానికి గురైన శ్రీనివాస రావు ఆత్మహత్య చేసుకునేందుకు చింతల పూడి సమీపంలో ఎదురుగా వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా పరిగెడుతున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన తన్నీరు శ్రీనివాస రావు బాధితుడ్ని కాపాడేందుకు చివరి నిమిషం దాకా వెంబడించాడు. రైలు ఢీకొని అతను మృతి చెందాడు. తన్నీరు శ్రీనివాసరావు తప్పించుకున్నాడు.
'మా దృష్టికి రాలేదు'
రైలు వేగంగా వచ్చి ఢీకొనడంతో సత్తిళ్ల శ్రీనివాస రావు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మృతుడి బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తరలించారు. ఘటనపై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషయం తమ దృష్టికి రాలేదని బాపట్ల రైల్వే ఎస్ఐ మహాలక్ష్మి పేర్కొన్నారు.
ఇవీ చూడండి : రోడ్డు ప్రమాదం : 9 మందికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం