అమరావతిలో ఆందోళనలు తీవ్రమయ్యాయి. పోలీసుల లాఠీఛార్జిని నిరసిస్తూ అమరావతిలో స్వచ్ఛందంగా బంద్ పాటించారు. అత్యవసర సేవలు మినహా వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. రాజధాని గ్రామాల్లో ఆందోళనలు మరింత తీవ్రం చేశారు. రైతులు, మహిళలు పెద్దఎత్తున దీక్షా శిబిరాలకు తరలివచ్చారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ వెలగపూడిలో 21 మంది మహిళా రైతులు చేపట్టిన నిరాహార దీక్షను ఎంపీ గల్లా జయదేవ్ నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. అనంతరం ఎస్సీ రైతులు చేపట్టిన 24 గంటల నిరాహారదీక్షను ఆయన ప్రారంభించారు.
సొమ్మసిల్లిన రైతు
రాయపూడి దీక్షా శిబిరంలో పెద్దఎత్తున మహిళలు, రైతులు పాల్గొని నిరసన తెలిపారు. రాజధానిగా అమరావతే కొనసాగాలంటూ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో పొంగళ్లు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మహిళలు సైతం పాల్గొన్నారు. వెలగపూడిలో దీక్షా శిబిరంలో కూర్చున్న ఇడుపులపాటి వాసుదేవరావు అనే రైతు గుండెపోటుతో సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. మందడంలో రైతులకు మాజీమంత్రి దేవినేని ఉమ సంఘీభావం తెలిపారు. పోలీసుల లాఠీచార్జిని నిరసిస్తూ తుళ్లూరులో రైతులు భారీ ర్యాలీ చేపట్టారు. దీక్షా శిబిరం నుంచి గ్రామ వీధుల్లో ర్యాలీగా రైతుల పాదయాత్ర నిర్వహించారు.
సీపీఎం మద్దతు
ఎర్రబాలెం, కృష్ణాయపాలెంలో ఆందోళన చేస్తున్న రైతులకు అమరావతి ఐకాస మహిళా విభాగం ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. 2 నెలలకు పైగా రైతులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు. కృష్ణాయపాలెంలో రైతుల దీక్షకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మద్దతు తెలిపారు.
ఇదీ చదవండి