High Court Judgement Effect In Telangana: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కేడర్‌కి వెళ్లి.. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్(క్యాట్)స్టే ఆధారంగా తెలంగాణలో కొనసాగుతున్న ఐఏఎస్ అధికారుల్లో ఆందోళన మొదలైంది. సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్‌కుమార్ వ్యవహారంలో.. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు, తదనంతర పరిణామాలు సదరు అధికారులను కలవరపాటుకు గురిచేశాయి. ఏపీ కేడర్ కేటాయింపుపై.. క్యాట్ ఇచ్చిన స్టేను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పు వెలువడిన కొద్దిగంటల్లోనే డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తీర్పు వచ్చిన కొద్దిగంటల్లోనే ఆదేశాలివ్వడం.. డీఓపీటీ ఉద్దేశ్యాన్ని స్పష్టం చేస్తున్నాయని అధికారవర్గాలు అంటున్నాయి.
మిగిలిన అధికారుల విషయంలోనూ.. ఇదే తరహా వైఖరిని అనుసరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే ఏపీ కేడర్‌కు కేటాయింపు జరిగి.. స్టే ఆధారంగా తెలంగాణలో కొనసాగుతున్న అధికారులకు ఇబ్బందులు తప్పకపోవచ్చని చర్చ జరుగుతోంది. ఇప్పటికే న్యాయస్థానంలో ఆ అంశం ఉన్న తరుణంలో డీఓపీటీ అదే తరహాలో తనవైఖరిని కోర్టుకు వినిపించే అవకాశం ఉందని అంటున్నారు. సోమేశ్‌కుమార్‌కి సంబంధించి ఇచ్చిన తీర్పునే.. ఉటంకించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే సదరు అధికారులకుప్రతికూల పరిస్థితులు ఉత్పన్నం కావచ్చని అంచనావేస్తున్నారు. ఇన్‌ఛార్జ్ డీజీపీ అంజనీకుమార్.. ఐపీఎస్ అధికారి అభిలాష బిస్త్, ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, వాణిప్రసాద్, రొనాల్డ్‌రోస్, ప్రశాంతి, అమ్రపాలి.. ఆ జాబితాలో ఉన్నారు.
ప్రస్తుత పరిణామాలు ఆ అధికారులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అధికారులతో పాటు ప్రభుత్వానికి ఇక్కట్లు తప్పేలా లేవు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు కీలకమైన రెవెన్యూ సంబంధిత అన్ని శాఖల బాధ్యతలు చూస్తున్న సీనియర్ అధికారి సోమేశ్ కుమార్ అందుబాటులో లేకుండాపోయారు. మిగిలిన అధికారుల విషయంలో ప్రతికూల ఫలితాలు వస్తే వారి పరిస్థితి అంతే. దీంతో సీనియర్ అధికారుల సేవలను కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల ఇన్‌ఛార్జిలు, అదనపు బాధ్యతలతో నెట్టుకొస్తున్న పరిస్థితి ఉంది. మరికొంత మంది అధికారుల సేవలు దూరమైతే సర్కార్‌కు మరిన్ని ఇక్కట్లు ఎదురుకానున్నాయి.
ఇవీ చదవండి: