No Use of Ration Vehicles in AP: నాణ్యమైన బియ్యం ప్యాకెట్లు వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ ఇస్తామన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టింది. ఇందుకు 80 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ప్యాక్ చేసిన బియ్యంలో తేమ కారణంగా గడ్డలు కడుతున్నాయని.. సంచులతో పర్యావరణానికి దెబ్బని చెప్పి.. ఆ పద్ధతికి మంగళం పాడేసింది. ప్యాకింగ్ యూనిట్లు, వాటి యంత్రాలను మూలన పడేసింది. ఆ తర్వాత రూటు మార్చి.. ఇంటింటికీ సరుకులు పంపిణీ పేరిట 538 కోట్లతో 9 వేల260 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ వాహనాలను కొనుగోలు చేసింది.
ఒక్కోటి 5 లక్షల81 వేల190 రూపాయల పెట్టి కొని.. ఏడాదికి 250 కోట్లకు పైగా నిర్వహణకు ఖర్చు చేస్తోంది. అయితే నేరుగా ఇంటికే సరుకులిస్తున్నారా అంటే.. లేనేలేదు. వీధిలో ఒక చోట ఆపి అక్కడికే రమ్మంటున్నారు. ఆ వాహనం.. ఎప్పుడు వస్తుందో తెలియక.. రేషన్ తీసుకోవాలంటే 1కి 2 రోజులు పని మానుకుని ఎదురు చూడాలి. కూలీ డబ్బులు పోగొట్టుకోవాలి. రాష్ట్రంలో వివిధ చోట్ల రేషన్ పంపిణీ తీరును ‘ఈటీవీ భారత్-ఈటీవీ-ఈనాడు’బృందం పరిశీలించగా.. వీధుల్లో వాహనాల వద్ద కార్డుదారులు బారులు తీరి కన్పించారు.
గ్రామాల్లో తక్కువ దూరంలోనే రేషన్ దుకాణాలు ఉండేవి. తెచ్చుకోవడానికి పెద్ద కష్టమూ ఉండేది కాదు. కుదిరినప్పుడు వెళ్లి తీసుకునేవారు. కొవిడ్ సమయంలోనూ నెలకు 2సార్లు రేషన్లు అందించినా అలానే తీసుకున్నారు. ఇప్పుడు మాత్రం రోడ్లపై గంటలకొద్దీ నిలబడాల్సిందే. సర్వర్, ఇతర సమస్యలు తలెత్తితే రోజుల తరబడి నిరీక్షణ తప్పదు. సాంకేతిక సమస్యలతో పాటు తమ వల్ల కాదంటూ కొన్ని చోట్ల వాహనాలు మూలనపడేశారు.
అసలు ఎన్ని వాహనాలు నడుస్తున్నాయే పౌరసరఫరాలశాఖకే తెలియదు. రేషన్ బళ్ల ద్వారా పంపిణీ సరిగా సాగడం లేదని ఈ ఏడాది మొదట్లో సీఎం కార్యాలయమే స్పష్టం చేసింది. పౌరసరఫరాలశాఖ అధికారులు అప్పుడు హడావుడి చేసి.. సీసీ కెమెరాలు, జీపీఎస్ విధానాలను ప్రవేశ పెట్టారు. దానికి అదనంగా ఖర్చు తప్పితే.. గడప వద్దకే రేషన్ అనేది ఆచరణలు సజావుగా అమలే కావడం లేదు.
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాకలో వాహనాన్ని 3 చోట్ల నిలిపి 100 మందికే ఇస్తున్నారు. విజయనగరం గ్రామీణ మండలంలో ఆపరేటర్ ఒక వీధిలో 2 ప్రాంతాలను ఎంపిక చేసుకొని కార్డుదారులను అక్కడికే రమ్మంటున్నారు. విజయనగరం మండలంలో ఆపరేటర్ ఒక వీధిలో 2 ప్రాంతాలకు... కార్డుదారులను పిలిపించుకుంటున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలువురు ఆపరేటర్లు వీధిలో రేషన్ బండి ఎక్కడ ఆపితే జనం అక్కడకి వెళ్లాల్సిందే. ఆపరేటర్లలో వైఎస్సార్సీపీ వాళ్లే ఎక్కువమంది ఉన్నందున అధికారులూ పట్టించుకోరు. కర్నూలు పాతబస్తీ బజార్ వీధి చివరే బండి ఆపుతున్నారు. మద్దికెర మండలంలోని అగ్రహారంలో వీధిలో ఒక చోట నిలిపితే.. 200 మంది కార్డు దారులు సరుకులు తీసుకెళ్తున్నారు. హాలహర్విలో ఎండీయూ బండి నిలిచిపోగా.. దానికి పశువును కట్టేశారు. వైఎస్‌ఆర్ జిల్లాలోనూ చాలా వాహనాలు నిలిచిపోగా.. వాటికి పెట్టిన ఖర్చంతా బూడిదలో పోసినట్లు అయింది.
అనంతపురం జిల్లాలో 405 వాహనాలు ఉండగా.. గిట్టుబాటు కావటంలేదని 2 నెలల క్రితం 67 మంది వదిలేసి వెళ్లిపోయారు. వీటిలో 26 వాహనాల సేవలు పునరుద్ధరించి.. 41 మూలకు పెట్టారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 349 వాహనాలు ఉండగా.. 37 మంది ఆపరేటర్లు విధుల నుంచి తప్పుకున్నారు. చాలా చోట్ల మళ్లీ దుకాణాలే దిక్కు అయ్యాయి.
ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలోనూ వీధిలో ఒక చోట ఆపి పంపిణీ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల ఆపరేటర్ మానేయడంతో వాహనం రెండేళ్లుగా తహసీల్దారు కార్యాలయం వద్దే ఉంది. ఈ జిల్లాలో దాదాపు 60 వాహనాలు ఆగిపోయాయి. ఏలూరు మండలంలో రెండు మూడు వీధుల ప్రజల్ని ఒకే చోటకి రమ్మంటున్నారు.
గుంటూరు జిల్లాలో ఎక్కడా కూడా వాహనం ఇంటింటికి వెళ్లడం లేదు. బాపట్ల జిల్లా భర్తిపూడిలో వీధి మలుపులోనే పంపిణీ చేస్తున్నారు. చెప్పిన తేదీకి వాహనం రాదు. చేబ్రోలు శివారు గ్రామం కొత్తరెడ్ది పాలెంలోని కొత్తగా కట్టిన కాలనీలో 67 కుటుంబాలు నివసిస్తున్నా..బండి వెళ్లడం లేదు. విజయవాడ నగరంలో ఇంటింటికి అందజేసే రేషన్ సరుకుల్లో బియ్యం, పంచదార మాత్రమే అందజేస్తున్నారు. కొన్నిచోట్ల బియ్యమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.
చాలా చోట్ల సర్వర్ పనిచేయడం లేదని చెప్పి జనాలను గంటల తరబడి నిలబెడుతున్నారు. బయోమెట్రిక్ సమస్యలు సరేసరి. లబ్ధిదారులు ఎండలో ఉండాల్సి వస్తోంది. వాహనం ఎప్పుడు వస్తుందో వాలంటీర్ల నుంచి సరైన సమాచారం ఉండటం లేదు. కందిపప్పు, చక్కెర ను కొద్దిమందికే ఇచ్చి.. సాకులు చెబుతూ ఆపేస్తున్నారు. కొన్ని చోట్ల రేషన్ సరకులకు రాయితీ ధరల కన్నా ఎక్కువ వసూలు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో తూకం వివరాలు డిస్‌ప్లే కాక.. మోసాలకు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. ఎవరూ అడగకున్నా.. తమ ఎన్నికల హామీని ప్రజలపై రుద్దిన వైసీపీ ప్రభుత్వం.. ఖజానాపై భారం పడుతున్నా, ప్రయోజనం లేదని తెలిసినా వెనక్కి తగ్గడం లేదు.