New Rules For Social Security Pensions : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సామాజిక భద్రత పింఛన్ల అర్హతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఓటరు కార్డు, పాస్‌పోర్టుతో లంకె పెట్టింది. ఇకపై కొత్తగా పింఛనుకు దరఖాస్తు చేసుకునే వారికి నివాస ధ్రువీకరణ కోసం వీటిని తప్పనిసరిగా సేకరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పింఛను వెబ్ పోర్టల్‌లో మార్పులు చేసింది. ఇప్పటి వరకు దరఖాస్తుదారుల వయసు, చిరునామా ధ్రువీకరించేందుకు ఆధార్‌కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దీన్ని కొనసాగిస్తూనే.. నాలుగు రోజుల క్రితం ఓటర్ ఐడీ, పాస్‌పోర్టును తప్పనిసరి చేస్తూ గ్రామ, వార్డు సచివాలయాలకు సమాచారాన్ని పంపారు. అయితే దీనిపై అధికారిక ఉత్తర్వులు ఇవ్వకుండా కేవలం సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం పంపినట్లు తెలుస్తోంది.
Voter ID or Passport Details Required for Social Security Pension : ఎన్నికలకు మరో అయిదు నెలలు మాత్రమే గడువున్న నేపథ్యంలో పింఛను లబ్ధి పేరుతో ప్రభుత్వం దరఖాస్తుదారుల ఓటరు ఐడీ నంబర్లను సేకరించే ప్రయత్నం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో దొంగ ఓట్ల చేరికలు, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్ల తొలగింపు (Elimination of Votes of Sympathizers of Opposition Parties), ఇష్టానుసారంగా పోలింగ్ బూత్‌ల మార్పుపై ఎన్నికల సంఘానికి భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పుడు చడీచప్పుడు లేకుండా.. అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండా తెరచాటుగా పోర్టల్‌లో మార్పులు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Troubles of new pensioners : పెన్షన్.. టెన్షన్..! పెన్షన్‌దారులకు షాకిస్తున్న విద్యుత్ సర్వీస్ నంబర్
ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు : ఓటరు ఐడీ సేకరణ ద్వారా వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓటేయాలని లబ్ధిదారులపై ఒత్తిడి చేయబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలా వేస్తేనే పింఛను ఇస్తామని వారికి అన్యాపదేశంగా సమాచారమివ్వబోతున్నారా? లేకపోతే నాలుగున్నరేళ్లపాటు అవసరం రాని ఓటరు ఐడీ వివరాల సేకరణను ప్రభుత్వం ఎన్నికల ముందు ఎందుకు తెరపైకి తెచ్చిందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
Social Security Pensions Rules in AP : 18 ఏళ్లు నిండిన వారందరికీ ఓటరు ఐడీని పోర్టల్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. 18 ఏళ్లలోపు వారికి మాత్రం ఆప్షనల్ అని పేర్కొంది. చాలా మందికి ఓటరు కార్డు (Voter ID)లోని నివాస చిరునామా రాష్ట్రంలోనే ఉన్నా వేరే చోట ఉన్న పిల్లల దగ్గరో, వృత్తి రీత్యా మరో ప్రాంతంలోనో ఉంటున్నారు. అలాంటి వారు కొత్తగా పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటే పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తనుంది.
అర్హత నిరూపించుకోకుంటే పింఛను శాశ్వతంగా రద్దు.. రాష్ట్ర ప్రభుత్వ హెచ్చరిక
వింత నిబంధనలు.. విస్తుపోతున్న ప్రజలు : సామాజిక భద్రత పింఛన్లు ఇచ్చేదే పేదలకు. అందులోనూ మెజారిటీ వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల పింఛన్లే. మరో 6 రకాల పింఛన్లు కుల వృత్తుల ఆధారంగా ఇస్తున్నారు. ఇక ఆరోగ్య పింఛన్లు, హిజ్రాలకు పింఛన్లు ఉన్నాయి. కొత్తగా పింఛనుకు దరఖాస్తు చేసుకోవాలంటే ఓటర్ కార్డు అది లేని పక్షంలో పాస్‌పోర్టు ఇవ్వాలని ప్రభుత్వం చెబుతోంది. సాధారణంగా పాస్‌పోర్టు మధ్య తరగతి, పైస్థాయి వారికి ఉంటుంది. లేదా గల్ఫ్ ప్రాంతాల్లో ఉపాధి కోసం వెళ్లిన వారికి ఉంటుంది. వ్యక్తి నివాస స్థలాన్ని ధ్రువీకరించుకునేందుకు 21 ధ్రువీకరణలు ఉండగా పాస్‌పోర్టు వివరాలివ్వాలనే వింత నిబంధన ఏమిటని ప్రజలు విస్తుపోతున్నారు.