త్వరలోనే ఆంధ్ర రాష్ట్ర సమితి అనే రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు గుంటూరు జిల్లా తాడికొండ మండలం నిడిముక్కల గ్రామానికి చెందిన జంజనం కోటేశ్వరరావు ప్రకటించారు. సమాజంలో పేదలకు ఆర్థిక పరిపుష్టి కల్పించాలన్నదే తమ లక్ష్యమన్న కోటేశ్వరరావు.. వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పార్టీని స్థాపించనున్నట్లు వెల్లడించారు. నూతన విధి విధానాలతో ప్రజల ముందుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు.
నిడుముక్కల గ్రామంలోని తన స్వగృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కోటేశ్వర రావు మాట్లాడారు. ఇప్పటికే 400 రోజులకు పైబడి రాజధానిలో రైతులు వివిధ రూపాలలో ఆందోళన కొనసాగిస్తున్నారని అయినా రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడం లేదని మండిపడ్డారు.
రాజధాని గ్రామాలలో కోటి 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం భూసేకరణకు వెళ్లాలని అన్నారు. వ్యక్తిగత దూషణలు తప్ప గత ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కరించిన పాపాన పోలేదని ఆయన ఆరోపించారు. రాజధానిలో అన్ని వర్గాల ప్రజలకు ప్లాట్లు ఉండాలని తమ లక్ష్యమని.. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే ఆలోచనలతో ముందుకు సాగుతామని తెలిపారు. ఏ రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. త్వరలో రాజధానిలో ఆంధ్ర రాష్ట్ర సమితి భవనాన్ని నిర్మిస్తామని కోటేశ్వరరావు తెలిపారు.