అంతర్జాతీయ పర్యటక కేంద్రంగా నాగార్జున సాగర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశవిదేశాల నుంచి బౌద్ధులు ఇక్కడికి వస్తుంటారు. సాగర్ జలాశయం మధ్యలోనున్న నాగార్జున కొండకు వెళ్లి ఆచార్య నాగార్జుడి కాలం నాటి పురావస్తు సంపదను సందర్శిస్తుంటారు. సాగర్‌కు వచ్చే పర్యటకులు లాంచీపై 14 కిలోమీటర్లు ప్రయాణించి కొండకు చేరతారు. 1700 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొండకు ప్రస్తుతం ప్రత్యేక గుర్తింపు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నాగార్జునకొండను ఆదర్శ స్మారకంగా గుర్తించింది. ఈనేపథ్యంలో ఇక్కడ సౌకర్యాలు మెరుగుపడి పర్యటకుల ఇబ్బందులు తొలగనున్నాయి.
ఆధునిక హంగులతో అలంకరణ..
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన 1950 దశకంలో ఇక్కడ బయటపడిన పురావస్తు సంపదను భద్రపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం నీటి మధ్యలోని కొండను ఎంపిక చేసింది. నాగార్జునకొండ పేరుతో పురావస్తు సంపదను భద్రపరిచేందుకు నిర్మాణాలు పూర్తిచేశారు. తవ్వకాలలో బయటపడిన మహాస్తూపం, 9 అడుగుల బుద్ధుని విగ్రహం, బుద్ధుని అవశేషాలు, శిలాఫలకాలు, మహాచైత్య స్తూపం, ఇక్ష్యాకుల కాలంనాటి క్రీడా ప్రాంగణం వంటివి ఎన్నో కొండపై భద్రపరిచారు. లోహపు పాత్రలు, రాగిభరిణెలు, బుద్ధధాతు వంటివి మ్యూజియంలో భద్రపరిచారు. పునర్నిర్మిత కట్టడాలు అలనాటి చరిత్రకు అద్దంపట్టేలా కనిపిస్తాయి.
వేల సంఖ్యలో పర్యటకుల రాక..
ప్రతి ఏటా దేశవిదేశాల నుంచి కొండపై మ్యూజియం సందర్శనకు వేల సంఖ్యలో పర్యటకులు వస్తుంటారు. కాని ఇక్కడ కనీస వసతులు లేక పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. బస చేసేందుకు ఎలాంటి కాటేజీలు అందుబాటులో లేవు. కనీసం తాగునీరు, మరుగుదొడ్లు అందుబాటులో లేవు. ఆదర్శ స్మారకంగా గుర్తించిన నేపథ్యంలో నాగార్జునకొండకు ఆధునిక హంగులు సమకూరనున్నాయి. మౌలిక వసతులతో పాటు విద్యుద్దీపాల అలంకరణ, అంతర్జాల సౌకర్యం వంటివి పర్యాటకులకు కల్పించనున్నారు. ప్రత్యేక గుర్తింపుతో కొండ రూపురేఖలు మారతాయని స్థానికులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: