కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలకు ఎగువ నుంచి భారీఎత్తున వరద నీరు చేరికతో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా రెండు నెలల పాటు క్రస్ట్ గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. అడపాదడపా ఒకటి రెండు సార్లు గేట్లు మూసినా ఈసారి ఎక్కువ రోజులు వరద ప్రవాహం కొనసాగింది. రెండు నెలల వ్యవధిలో దాదాపు 446.20 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది.
వర్షాకాలం ఆరంభంలో సాగర్ జలాశయం ఖాళీగా కనిపించింది. ఈ ఏడాది నీటి చేరిక ఉంటుందో లేదోనని జలవనరులశాఖ అధికారులు ఆందోళన చెందారు. కాని అనూహ్యంగా వరదొచ్చింది. 2009 సంవత్సరం తరువాత ప్రాజెక్టుకు నీటి చేరిక 2019, 2020లోనే కనిపించింది. పూర్తిస్థాయిలో 590 అడుగుల నీటిమట్టం నమోదైంది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలకు అక్కడి ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండాయి. ఆయా రాష్ట్రాల పరిధిలోని ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో రాష్ట్రంలోని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. సాగర్ నుంచి నీటి విడుదలతో పులిచింతల తరువాత ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలోకి చేరింది. గత ఏడాది మొత్తం విడతల వారీగా సాగర్ గేట్ల ద్వారా 950 టీఎంసీలు నీరు సముద్రానికి వదిలారు. ప్రస్తుత ఏడాది పరిశీలిస్తే రెండు నెలల్లో దిగువకు పరుగులు తీసిన నీరు 446.20 టీఎంసీలు. ప్రస్తుతం శ్రీశైలం నుంచి నామమాత్రంగా వస్తున్న నీటిని విద్యుదుత్పాదన ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు.
ముందు జాగ్రత్తగా పూర్తిస్థాయి నీటి నిల్వలు
నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేశారు. శ్రీశైలం నుంచి వచ్చే నీటిని వాటా ప్రకారం సాగర్ కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పాదనకు ఉపయోగిస్తున్నారు. ప్రాజెక్టులో 510 అడుగుల నీటిమట్టం వరకు హైదరాబాద్‌కు నీటిని సరఫరా చేసే అవకాశం ఉంది. ఎప్పుటికప్పుడు ఎగువ నుంచి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ నీటిని నిల్వ చేయడం లేదా దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం మరో రెండు నెలలు కొనసాగే అవకాశం ఉందని జలవనరులశాఖ అధికారులు చెబుతున్నారు. మరింత నీరు సముద్రానికి వదిలే అవకాశం ఉందని వివరిస్తున్నారు.
ఇదీ చదవండి: