Nadendla Manohar on YSRCP Government Corruption: 'ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన.. 'జగనన్న విద్యా కానుక'లో భారీ స్కామ్ జరిగింది. నిధులను మళ్లించి నాడు-నేడు పేరిట ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే వస్తువుల నాణ్యత సరిగా లేదు.. అందులోనూ కుంభకోణం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తున్నాం. ఆధారాలు లేకుండా మేము ఆరోపణలు చేయం. అవినీతిపై విచారణ చేసి, జగన్ చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే టోఫెల్, పాలవెల్లువ పథకంలో జరిగిన అవినీతిని బయటపెట్టాం. ఇప్పుడు విద్యా శాఖలో జరిగిన అవినీతిని బయటకు తెస్తున్నాం' అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
Nadendla Manohar on Corruption: వైసీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అవినీతిని.. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధారాలతో సహా వెల్లడిస్తున్నారు. ఇప్పటికే టోఫెల్, పాలవెల్లువ పథకాల్లో జరిగిన అవినీతిని బయటపెట్టిన ఆయన.. మంగళవారం 'జగనన్న విద్యా కానుక'లో జరిగిన అవినీతిని బయటికి తెస్తున్నామన్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. పలు సంచలన విషయాలను వెల్లడించారు.
అవినీతిని ప్రశ్నిస్తే జగన్ ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంది: నాదెండ్ల మనోహర్
Nadendla Manohar Comments: ''ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే వస్తువుల నాణ్యత సరిగా లేదు. గతేడాది రూ.1050 కోట్లతో విద్యార్థులకు బ్యాగులు, షూస్ కొనుగోలు చేశారు. 42 లక్షల మంది పేద విద్యార్థుల కోసం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారు. టెండర్ ప్రక్రియలో ఐదు కంపెనీలు సిండికేట్‌గా ఏర్పడ్డాయి. రూ.1050 కోట్లు విద్యార్థుల సామగ్రి కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఆ నిధులు దారి మళ్లినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో తేలింది. మూడేళ్లలో పథకం కింద సామగ్రికి రూ.2400 ఖర్చు చేశారు. విద్యార్థుల సామగ్రి కొనుగోలులో కుంభకోణం జరిగింది. ఆంగ్లం నేర్పేందుకు 32 వేల ఫ్లాట్ ప్యానెల్స్ సరఫరా చేస్తామన్నారు. గతేడాది రూ.300 కోట్లతో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ కొనుగోలు చేశారు. గతేడాది ఫ్లాట్ ప్యానెల్స్‌కు సంబంధించి నేటికీ డబ్బులు ఇవ్వలేదు. రూ.400 కోట్లతో ఫ్లాట్ ప్యానెల్స్ కొనుగోలు పేరిట మరో కుంభకోణం జరిగింది'' అని నాదెండ్ల మనోహర్ అన్నారు.
Nadendla Manohar on Nadu-Nedu Program: రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దామని గొప్పలు చెబుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. నాడు-నేడు కార్యక్రమానికి నాబార్డు నుంచి రూ.1800 కోట్ల రుణం తెచ్చారని.. నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. పాఠశాల వ్యవస్థకు రూ.16 వేల కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ అవాస్తవాలన్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.700 కోట్లు రుణం తీసుకున్నారన్నారు. సర్వశిక్షా అభియాన్ కోసం జగన్ ప్రభుత్వం రూ.1000 కోట్లు గ్రాంట్ తీసుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.6 వేల కోట్ల రుణాన్ని గ్రాంట్ రూపంలో తెచ్చిందన్న మనోహర్.. పాఠశాల అభివృద్ధి పనుల్లో ఖర్చు చేసింది రూ.3850 కోట్లు మాత్రమేనని వివరించారు. పాఠశాల అభివృద్ధికి తెచ్చిన నిధుల్లో రూ.2150 కోట్లు దారి మళ్లాయని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు మరో రూ.1350 కోట్లు చెల్లించాల్సి ఉందని, బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో రూపాయి కూడా ఖర్చు చేయలేదని నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి.. రాష్ట్రంలో 8,022 ఆంగ్ల ల్యాబ్‌లు చేస్తామని ఒక్కటీ కూడా పూర్తి చేయలేదన్నారు.
పాల వెల్లువ పథకంలో 2వేల కోట్లకు పైగా కుంభకోణం : జనసేన నేత నాదెండ్ల మనోహర్
''రాష్ట్రంలో అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తున్నాం. ఇదివరకే టోఫెల్, పాలవెల్లువ పథకంలో జరిగిన అవినీతిని బయటపెట్టాం. ఇప్పుడు విద్యాశాఖలో జరిగిన అవినీతిని బయటకు తెస్తున్నాం. జగనన్న విద్యా కానుక పేరుతో ప్రవేశపెట్టిన కిట్స్‌లో భారీ అవినీతి జరిగింది. దిల్లీలో ఐదు కంపెనీలపై ఈడీ దాడులు చేసింది. ఆ ఐదు కంపెనీలు విద్యా కానుక కిట్లు సరఫరా చేస్తున్నాయి. ఇప్పటివరకు ఆ ఐదు కంపెనీలకు రూ.2,400 కోట్లు ఖర్చు చేశారు. టెండర్లు ఆ ఐదు కంపెనీలకే ఎందుకు ఇచ్చారు..? గ్లోబల్ విద్యార్థులను తయారు చేస్తామని మోసం ఎందుకు చేశారు..? నాడు-నేడులో రూ.16 వేల కోట్ల ఖర్చు చేశామంటున్నారు కదా.. రూ.6 వేల కోట్లు గ్రాంట్లు వస్తే రూ.3,550 కోట్లే ఎందుకు ఖర్చు చేశారు..? అంటే మిగిలిన ఆ డబ్బులను దారి మళ్లించారు. బడ్జెట్‌లో కేటాయించిన నిధులను ఖర్చు చేయలేదు. వంటశాలలు, ప్రహరీ గోడలు నిర్మించకుండా దగా చేశారు. నిధుల మళ్లింపుపై కేంద్రం వెంటనే స్పందించాలి.''-నాదెండ్ల మనోహర్, జనసేన పీఏసీ ఛైర్మన్