కేంద్ర తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు మాట్లాడారు. గుంటూరు జిల్లా రొంపిచర్లలో మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతోపాటు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీరంగనాధరాజు పాల్గొన్నారు. మార్కెట్ యార్డులు యథావిధిగానే కొనసాగుతాయని ఎంపీ తెలిపారు. రానున్న కాలంలో మార్కెట్ యార్డులు ప్రశ్నార్థకంగా మారతాయని కొందరు రైతులు ఆందోళన పడుతున్నారన్నారు. అలాంటి ఆలోచనలేమైనా ఉంటే వాటిని మానుకోవాలన్నారు. నూతన వ్యవసాయ చట్టాలతో మార్కెట్ యార్డులకు ముప్పేమీ లేదన్నారు. మార్కెట్ యార్డుల్లో యథావిధిగానే ప్రభుత్వం అన్ని రకాల పంటలను కొనుగోలు చేస్తుందని వివరించారు.
నూతన వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్ష నాయకులు చేస్తున్న అపోహలను ప్రజలు నమ్మొద్దని శ్రీకృష్ణదేవరాయలు వ్యాఖ్యానించారు. తెదేపా హయాంలో ఐదేళ్ల పరిపాలనలో రైతుల కోసం కేవలం రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తే.. వైకాపా ప్రభుత్వం ఇప్పటికే రూ.34 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. రొంపిచర్ల మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం అనంతరం నుంచే రైతులకు ఉపయోగపడే విధంగా నూతన కమిటీ సభ్యులు పని చేయాలని ఎంపీ సూచించారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ నిర్ణయంపై తెలుగు నిర్మాతల ఆనందం