నాగార్జునసాగర్ జలాశయం రెండున్నర నెలలుగా నిండుకుండలా తొణికిసలాడుతోంది. మధ్యలో ఒకటి రెండు రోజులు తప్ప, ఆగస్టు 12 నుంచి ఇప్పటి వరకు అత్యధిక రోజులు జలకళను సంతరించుకొంది. ఎక్కువ రోజులు ప్రాజెక్టులో నీరు నిల్వ ఉండటంతో ఈ ఏడాది చరిత్రలో నిలిచిపోతుందని పర్యవేక్షణ అధికారులు చెబుతున్నారు. 2009 సంవత్సరంలో సాగర్‌కు భారీ వరద వచ్చినా అప్పట్లో 15 రోజులే పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగుల వద్ద కొనసాగింది. ఈ పదేళ్ల కాలంలో చూస్తే ఇదొక రికార్డుగా మిగిలిపోతుంది.
సాగర్ జలాశయం నిండుతుందా.. లేదా.. అన్న సంశయంతో ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభంలో ఆయకట్టు కింద వరి పంట వేసేందుకు అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుత సంవత్సరం అధిక వర్షపాతం నమోదు కావడంతో సాగర్ జలాశయం నుంచి సముద్రానికి నీరు విడుదల చేశారు. అత్యధిక రోజులుగా సాగర్ క్రస్ట్‌గేట్లు నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ దిగువకు పరుగులు తీసింది. గతేడాది నవంబర్ నాటికి నాగార్జునసాగర్ క్రస్ట్‌గేట్ల నుంచి 700 టీఎంసీల నీళ్లు దిగువకు విడిచిపెట్టారు. కాని ప్రస్తుతం ఈ ఏడాది నవంబరు రాకుండానే 796 టీఎంసీల జలాలు సముద్రం పాలయ్యాయి. నవంబర్ నెలలో ఎగువ ప్రాంతాల నుంచి నీటి విడుదలను బట్టి గేట్ల ద్వారా మరింత నీరు దిగువకు విడుదల చేసే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. సాగర్ జలాశయం ఈ ఏడాది తొలిసారిగా ఆగస్టు 12న నిండింది. అప్పటి నుంచి శ్రీశైలం జలాశయం నుంచి వరద నీరు రావడంతో సాగర్ గేట్లు ఎత్తుతున్నారు. నెల వ్యవధిలో ఎక్కువ రోజులు 18 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడిచిపెట్టారు. ప్రస్తుతం ఎగువ నుంచి లక్ష క్యూసెక్కుల వరకు నీటి చేరిక కనిపిస్తుంది. సాగర్ ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తారు. ఈఏడాది నీరు పుష్కలంగా ఉండటంతో జల విద్యుత్తు కేంద్రం ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. కాలువలకు పూర్తిస్థాయిలో నీటిని వదులుతున్నారు.
పదేళ్ల కాలంలో ఎన్నడూ చూడని విధంగా..
2011-18 సంవత్సరాల మధ్య కాలంలో నాగార్జునసాగర్ జలాశయం బోసిపోయింది. వర్షాభావంతో సాగర్ గేట్లను ఎత్తేలేదు. దిగువకు నీరు పారలేదు. ఆ దశాబ్దంలో ఎప్పుడు నీటిని విడుదల చేస్తారా.. అని ఆయకట్టు కింద రైతులు ఎదురుచూపులు చూసేవారు. సాగు నీటి కోసం పొలాల్లో యుద్ధాలు జరిగేవి. తాగునీటికి అవస్థలు తప్పలేదు. కాని ఈసారి అధిక వర్షపాతంలో ఆ ఇబ్బందులు తప్పాయి. 2019లో జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీటితో నిండుకుండలా మారింది. క్రస్ట్‌గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. దాదాపు ఏడాది మొత్తం మీద 700 టీఎంసీలే నీరు విడుదల చేసినా ఎక్కువ రోజులు పూర్తిస్థాయి నీటిమట్టం కొనసాగింది లేదు. ప్రస్తుత ఏడాది రికార్డుస్థాయిలో జలాశయం నీటితో తొణికిసలాడింది.
సాగర్ పూర్తి నీటిమట్టం(అడుగుల్లో) 590
డెడ్ స్టోరేజీ(కనిష్ఠ నిల్వ) 510
నాగార్జునసాగర్ నుంచి సాగు అవసరాలకు నీటిని విడుదల చేయాలంటే నీటిమట్టం 510 అడుగులపైనే ఉండాలి. తాగునీటి కోసం విడుదల చేసేందుకు 490 అడుగుల వద్ద నీటిమట్టం కొనసాగాలి.
ఇదీ చదవండి: