దిగజారుడు రాజకీయాలు చేయడం తెదేపాకు వెన్నతో పెట్టిన విద్య అని మంత్రి మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. ప్రభుత్వమే కోడెల మరణానికి కారణమంటున్న తేదేపా నేతల వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు. కోడెల శివప్రసాదరావు మరణం బాధాకరమని... గుంటూరు జిల్లా ఒక సీనియర్ నేతను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కోడెల మృతిని తెదేపా వివాదాస్పదం చేయడం మంచిది కాదన్నారు. చనిపోయిన సంఘటనను రాజకీయ కోణంలో మలచి లబ్ది పొందాలని తెలుగుదేశం పార్టీ నాయకులు చూడటం దారుణమని వ్యాఖ్యానించారు. మాజీ సభాపతిపై కొద్దికాలంగా అవినీతి ఆరోపణలు రావడం అందరికీ తెలిసిందేనన్నారు.
శివప్రసాదరావు మరణానికి అతని కుమారుడే కారణమని... స్వయానా కోడెల మేనల్లుడు తెలిపిన విషయం గుర్తు చేశారు. దానిపైన సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వారి కుటుంబానికి అండగా ఉండాల్సింది పోయి... ప్రభుత్వంపై బురదజల్లడం బాధాకరమన్నారు. కోడెల కుటుంబానికి వైకాపా తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చదవండీ... గన్నవరం విమానాశ్రయానికి.. కోడెల తనయుడు