Monsoons Enter into AP: గత కొన్నిరోజులుగా భానుడి భగభగలతో.. ఉక్కిరిబిక్కిరైపోతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లటి కబురు అందించింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు.. కేరళ, కర్ణాటక, తమిళనాడు తీరాన్ని తాకగా.. తాజాగా ఏపీలోకి ప్రవేశించాయని.. వాతావరణ కేంద్రం ప్రకటించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోట సహా సమీప ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని.. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ఉత్తర కొన శ్రీహరి కోట, కర్ణాటక, తమిళనాడులోని ధర్మపురి, రత్నగిరి, శివమొగ్గ, హాసన్ తదితర ప్రాంతాలపై ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోని మరిన్ని ప్రాంతాలకు నైరుతి పవనాలు విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
మరోవైపు.. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఏర్పడిన 'బిపర్ జాయ్' తుపాను రానున్న 24 గంటల్లో ఉగ్రరూపం దాల్చనున్నట్లు ఐఎండీ వెల్లడించింది. దీంతో గుజరాత్లోని సౌరాష్ట్ర, కచ్ తీర ప్రాంతాలకు వాతావరణం కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో పోర్ బందర్ తీరానికి దగ్గరగా 460 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ద్వారక తీరానికి నైరుతిగా 600 కిలోమీటర్లు దూరంలో ఉన్నట్టు ఐఎండీ వెల్లడించింది. దీంతో రానున్న ఐదు రోజుల్లో సౌరాష్ట్ర-కచ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తీవ్ర తుపాను ప్రభావంతో మహారాష్ట్ర, గోవా, గుజరాత్ తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది. పశ్చిమ తీరంలోని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.