గుంటూరులో జరిగిన స్పందన కార్యక్రమానికి బాధితులు అధిక సంఖ్యలో వచ్చారు. తమ సమస్యలను అధికారులుకు విన్నవించుకుని సత్వర పరిష్కారం చూపించాలని కోరారు.. వారి సమస్యలు వాళ్ల మాటల్లోనే....
20 నెలలుగా ఉద్యోగాల ప్రకటన లేదు
''2017-18 నుంచి.. విభిన్న ప్రతిభావంతుల్లో బధిరులకు సంబంధించి ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేయాలని జిల్లా అధికారులను కోరుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు. ఫలితంగా.. 2018 - 19, 2019 - 20 ఏడాదుల ఖాళీలనూ భర్తీ చేసే అవకాశం లేకపోయింది. ఈ నెల 27 లోపు ఉద్యోగాల ప్రకటన విడుదల చేయాలని గడువు నిర్దేశించినా.. ఆ శాఖ అధికారుల్లో స్పందన లేదు'' అంటూ వివేకానంద అంధులు సంక్షేమ సంఘ సభ్యులు వాపోయారు.
సాగుకు ఆటంకాలు తొలగించాలి..
''ఎన్నో ఏళ్లుగా అటవీ భూములను గిరిజనులం సాగు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నాం. ఇటీవల గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మేము సాగు చేసుకుంటున్న భూములను ఆక్రమించేందుకు బెదిరిస్తున్నారు. పంటలను తొలగిస్తున్నారు. సాగుకు వారి నుంచి ఎదురవుతున్న ఆటంకాలను తొలగించాలని కోరుతున్నాం'' అని బాధితులు చెప్పారు. వెంటనే స్పందించిన కలెక్టరు మండల తహశీల్దారుకు ఫోన్ చేశారు. 15 రోజుల్లో గ్రామసభ నిర్వహించాలని ఆదేశించారు.
చివరలో అనర్హులంటున్నారు..
''గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్) పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించాం. విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి ఉద్యోగ ప్రకటన విడుదల చేసిన తేదీ లోపు పారామెడికల్ బోర్డు వద్ద సర్టిఫికెట్లను నమోదు చేసుకోలేదని చెప్పి 58 మందిని అనర్హులుగా ప్రకటించారు. కృష్ణా, అనంతపురం తదితర జిల్లాల్లో ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని కలెక్టరు, డీఎంహెచ్‌వోల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ ఆలకించటం లేదు. పరీక్షల్లో మా కంటే తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలి'' అని ఏఎన్‌ఎం అభ్యర్థులు కోరున్నారు.
నిరుపేదలకు భూ పంపిణీ చేయాలి
''సర్వే నం.504-15లో 300 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. 108 ఎకరాలను అగ్రవర్ణాలు, ధనికులకు పంపిణీ చేశారు. మిగిలిన భూమిని నిరుపేదలకు పంపిణీ చేసి ఆదుకోవాలి. అసైన్డ్ భూములను కొందరు విక్రయించటంతో పాటు క్రషర్ల నిర్వాహకులు 60 ఎకరాలు ఆక్రమించారు. నిరుపేదలకు న్యాయం చేయాలి'' అని పలువురు అధికారులను కోరారు.
ఇదీ చూడండి