Minister Merugu Nagarjuna respond to Victor Prasad comment: రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్ మహాత్మాగాంధీపై చేసిన వ్యాఖ్యలపై వైకాపా నేత మంత్రి మేరుగు నాగార్జున స్పందిచారు. ఇలాంటి వ్యాఖ్యలను ప్రభుత్వపరంగా, పార్టీపరంగా ఖండిస్తున్నామని.. నాగార్జున స్ఫష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలతో ప్రభుత్వానికి, పార్టీకీ ఎలాంటి సంబంధం లేదని మంత్రి అన్నారు. ఆయన జవాబుదారీతనంగా, బాధ్యతాయుతంగా మాట్లాడాలని స్పష్టం చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి అలా వ్యాఖ్యలు చేయడం తగదని మంత్రి పేర్కొన్నారు. ఆయన మాటల్ని ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు అంటగట్టొద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు బీసీల గురించి మాట్లాడుతున్న తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్.. తన తండ్రి వారి గురించి అన్న మాటల్ని గుర్తు తెచ్చుకోవాలని మంత్రి ఎద్దేవా చేశారు. ఆ విషయాలను తెలుసుకునే లోకేశ్ ట్వీట్లు చేయాలని మంత్రి అన్నారు.
విక్టర్ ప్రసాద్ ఏమన్నారంటే: ‘గాంధీని మీరంతా మహాత్ముడని అంటే.. నేను దుర్మార్గుడు, నీచుడు అంటాను’ అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు. మూడు రోజుల కిందట పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం రాజులపేటలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘దేశంలో ఓటుహక్కు ఎవరికి ఇవ్వాలనే విషయమై 1932లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో చర్చ జరిగింది. అప్పుడు గాంధీ అనే దుర్మార్గుడు.. ఈ దేశంలో బ్రాహ్మణులు, వైశ్యులు, రాజులతోపాటు ఒకటి రెండు కులాలకు తప్ప మిగిలిన కులాలకు ఓటుహక్కు అసలు వద్దన్నారు. ఆడవారు ఏ కులంలో పుట్టినా వారికి ఓటుహక్కు, విద్య వద్దన్నారు. వారు ఉద్యోగం చేయడానికీ పనికిరారన్నారు. మహిళలకు ఆస్తిహక్కు వద్దన్నారు. అసలు బయటకు రావడానికే వీల్లేదన్నారు’ అని పేర్కొన్నారు.
విక్టర్ ప్రసాద్ వ్యాఖ్యలపై నిరసన: మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ఆర్యవైశ్య సంఘం నాయకులు బుధవారం నిరసన తెలిపారు. మధ్యాహ్నం నుంచి పట్టణంలో దుకాణాలను మూసేశారు. అనంతరం గాంధీబొమ్మ కూడలికి చేరుకుని మహాత్ముని విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఆర్యవైశ్య సంఘం ఆకివీడు శాఖ అధ్యక్షుడు పులవర్తి లక్ష్మణబాబా, మండల అధ్యక్షుడు సన్నిధి రామ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విక్టర్ ప్రసాద్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం తహసీల్దారు వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు.
ఇవీ చదవండి: