Gudivada Amarnath Comments On Chandrababu: కుప్పం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. చంద్రబాబు పర్యటనలో పోలీసులు వర్సెస్ టీడీపీ నాయకులు అన్నట్లుగా మారిపోయింది. నిన్న జగన్ పర్యటనకు రాని ఇబ్బందులు.. నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలోనే వస్తున్నాయా అని టీడీపీ నేతలు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఇదే సందర్భంలో పోలీసులు మాత్రం అధికారుల ఆదేశాలు, పోలీసు యాక్ట్ అమలు అంటూ.. అడ్డంకులు పెడుతున్నారనీ టీడీపీ కార్యకర్తలు, నాయకులు మండిపడుతున్నారు. ఈ రోజు చంద్రబాబు పర్యటనపై పోలీసులు వ్యవహరించిన తీరుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో.. మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు.
కుప్పం బహిరంగ సభకు చంద్రబాబు అనుమతి తీసుకున్నారా లేదో తెదేపానే చెప్పాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. కందుకూరు రోడ్ షోలో 8 మంది చనిపోయారు.. ఇప్పుడు కుప్పంలో కూడా చంపాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు వేరే చట్టాలు లేవు.. దేశమంతా 1861 పోలీసు చట్టాన్నే అనుసరిస్తోందని తెలిపారు. ప్రజల కస్టోడియన్గా ప్రభుత్వం కొన్ని నియంత్రణలు చేస్తుందన్న మంత్రి.. ప్రజల ప్రాణాలు తీసేలా రోడ్ షోలు చేస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంతోనో, దేశంతోనో పని లేదనుకుంటే నిత్యానంద స్వామిలా ఒక దీవి కొనుక్కోవాలని ఎద్దేవా చేసారు. రోడ్ షోల గురించి ఒక ఓటు, ఒక సీటు లేని పార్టీలు కూడా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు.