గుంటూరు జిల్లా నరసారావుపేట పట్టణం పరిధిలోని ప్రజలు ధ్రువపత్రాల కోసం అవస్థలు పడుతున్నారు. మీ సేవ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆరునెలలుగా జీతాల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 15ఏళ్లుగా మీసేవ కేంద్రాలనే నమ్ముకొని జీవిస్తున్నామని, ఉన్నట్టుండి కేంద్రాల మూసివేత ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. కనీసం ముందస్తుగా ప్రకటన కూడా చేయలేదని వాపోతున్నారు. పట్టణ మీసేవ కేంద్రాలు నడుస్తున్న భవనాల్లోనే సచివాలయాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తమ మొర ఆలకించి యథావిధిగా కేంద్రాలు నడిచేలా చూడాలని కోరుతున్నారు. జిల్లాలోని అన్ని పట్టణాల్లో 19 మీసేవ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క దానిలో నలుగురు చొప్పున మొత్తం 76 మంది పని చేస్తున్నారు. ఒక్కొక్క కేంద్రంలో ఒక మేనేజర్, ముగ్గురు ఆపరేటర్లు ఉన్నారు. కేంద్రాలు మూతపడటంతో వీరి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది.
పూర్తిస్థాయిలో లేని సచివాలయాల్లో సేవలు
ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాలు పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రాలేదు. అక్కడ ఉన్న సిబ్బందికి వీటిపై అవగాహన లేకపోవడంతో అర్జీల కోసం వచ్చే ప్రజలకు సకాలంలో సేవలందించ లేకపోతున్నారు. దరఖాస్తు చేసుకున్న రోజే సమస్య పరిష్కరిస్తామని అధికారులు చెప్పినా ఆ దిశగా సచివాలయాలు పని చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలకు నిరంతరం సత్వర సేవలందిస్తున్న మీసేవలను మూసి వేయడం.. సచివాలయాల్లో సేవలు అందుబాటులోకి రాకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
ప్రైవేటు కేంద్రాలకు బారులు
అన్ని సేవలు సచివాలయాల్లో అందించేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు. అయితే అక్కడ అరకొర సేవల కారణంగా అధిక శాతం మంది ప్రజలు మీసేవ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. పట్టణ పరిధిలో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నవి మూసివేయడంతో ప్రైవేటు మీసేవ కేంద్రాల వద్ద జనం బారులు తీరుతున్నారు. అయితే వాటికి కూడా అప్పుడప్పుడు సర్వర్లు పనిచేయక ఇబ్బందులు పడాల్సి వస్తోందని చెబుతున్నారు. అయితే త్వరలో మా కేంద్రాలను కూడా మూసివేస్తారనే పుకార్లు జరుగుతున్నాయని, అదే జరిగితే రోడ్డున పడాల్సి వస్తుందని ప్రైవేటు మీసేవ కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా మీసేవ కేంద్రాల వివరాలు ఇలా..
గుంటూరు: 5, నరసరావుపేట: 2, చిలకలూరిపేట: 2, వినుకొండ : 1, సత్తెనపల్లి: 1, బాపట్ల : 1, రేపల్లె : 1, తెనాలి: 3, పొన్నూరు: 1, మాచర్ల :1, మంగళగిరి: 1
ఇదీ చూడండి