గుంటూరు జిల్లాలో పలు మున్సిపాల్టీల్లో సమీపంగా ఉన్న గ్రామ పంచాయతీలను విలీనం చేశారు. అయితే వాటిని అనాలోచితంగా కలిపారని కొన్నిచోట్ల ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఇటు పురపాలికలకు, అటు పంచాయతీలకు కాకుండా పోయాయి ఆ గ్రామాలు. పురపాలికల్లో విలీనం చేయకుండా ఉంటే తమ గ్రామాలకు ప్రస్తుతం ఎన్నికలు జరిగేవని తద్వారా సమస్యలను పరిష్కరించుకోవటానికి మంచి అవకాశం దక్కేదని ఆయా గ్రామాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మున్సిపాల్టీల్లో ప్రత్యేకపాలన నడుస్తోంది. వాటికి పాలకవర్గాలు లేవు. గుంటూరు నగరపాలక సంస్థలో దశాబ్దం కిందట 10 పంచాయతీలు కలిశాయి. అవి విలీనమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గుంటూరు నరగపాలకకు ఎన్నికలు జరగలేదు. విలీన గ్రామాలను అటు మున్సిపాల్టీలు, ఇటు పంచాయతీశాఖలు పట్టించుకోవడంలేదు. అభివృద్ధి చేయకపోగా ఆస్తి పన్నులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు.
ఈ మూడు తీర్మానాలు పక్కాగా లేక..
గ్రామాల విలీనంపై గ్రామసభ, పంచాయతీ, కౌన్సిల్ తీర్మానం చేసి ఈ మూడింటిని కలిపి ప్రభుత్వానికి పంపితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ గుంటూరు నగరంతో పాటు బాపట్ల, నరసరావుపేట, చిలకలూరిపేట పురపాలికల్లో కొన్ని గ్రామాలను విలీనం చేసుకునేటప్పుడు ఈ విధానం అవంభించలేదు. దీంతో కొన్ని గ్రామాలపై స్టేలు కొనసాగుతున్నాయి. గుంటూరు నగరపాలకలోకి లాలుపురం విలీనంపై కోర్టు కేసులు ఉన్నాయి. అక్కడ అభివృద్ధి ఆగింది. ఒకవేళ పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత పురపాలికలకు ఎన్నికలు జరిపినా ఈ కోర్టు కేసులు ఉన్న విలీన గ్రామాలకు ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది స్పష్టత లేకుండా ఉంది. విలీన గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కల్పించిన దాఖలాలులేవు. ఆపై ఉద్యానవనాలు ఏర్పాటు, క్రీడా ప్రాంగణాలు వంటి సౌకర్యాలు కల్పించలేదు. కనీసం పారిశుద్ధ్య కార్మికులతో కూడా పక్కాగా పూడికలు తీయించటం వంటివిచేయటం లేదని, వీధి దీపాలు అరకొరగానే ఏర్పాటు చేసి పురపాలికలు చేతులు దులిపేసుకుంటున్నాయనే అపవాదును మూటగట్టుకున్నాయి. ఆయా గ్రామాల్లో మోకాల్లోతు గుంతలుపడి రాకపోకలకు అసౌకర్యంగా ఉంటున్నా పట్టించుకోవటం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది.
గుంటూరు నగరం: గోరంట్ల, రెడ్డిపాలెం, అడవితక్కెళ్లపాడు, పెదపలకలూరు, నల్లపాడు, అంకిరెడ్డిపాలెం, బుడంపాడు, ఏటుకూరు, పొత్తూరు,
చౌడవరంతాడేపల్లి: ప్రాతూరు, వడ్డేశ్వరం, పెనుమాక, ఇప్పటం, మల్లంపూడి, చిర్రావూరు, గుండెమెడ, ఉండవల్లి, కుంచనపల్లి, కొలనుకొండ
మంగళగిరి: ఆత్మకూరు, నవులూరు, బేతపూడి, యర్రబాలెం, చినకాకాని, నిడమర్రు, నూతక్కి, కాజ, చినవడ్లపూడి, రామచంద్రాపురం, పెదవడ్లపూడి
పొన్నూరు: చింతలపూడి, పెదాయి టికంపాడు, వడ్డిముక్కల, కట్టెంపూడి, ఆలూరు
బాపట్ల: కేబీపాలెం, అసోదివారిపాలెం, మరుప్రోలువారిపాలెం, చింతాయపాలెం, ముత్తాయపాలెం, వల్లూరివారిపాలెం, నందిరాజుతోట, దరివాడకొత్తపాలెం, అడవి
నరసరావు పేట: యలమంద, కేశనపల్లె, ఇసప్పాలెం, రావిపాడు, లింగంగుంట్ల
చిలకలూరిపేట: పసుమర్రు, గణపవరం
ఇదీ చదవండి: పల్నాడు పల్లెల్లో కక్ష సాధింపులు.. ప్రత్యర్థులపై దాడులు..!