కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా గుంటూరులో జిల్లాలో అధికార యంత్రాంగం మాక్ డ్రిల్ నిర్వహించింది. పట్టాభిపురంలో నిర్వహించిన ఈ మాక్ డ్రిల్‌లో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ అనురాధ, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి యాస్మీన్, అదనపు ఎస్పీ గంగాధర్ పాల్గొన్నారు. ఎక్కడైనా కరోనా వ్యాధిగ్రస్తుడు ఉన్నట్లు తేలితే వివిధ శాఖలు సమన్వయంతో ఏం చేయాలనే దానిపై ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు.
మాక్ డ్రిల్‌లో భాగంగా వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఎవరైనా జలుబు, జ్వరంతో బాధపడుతున్నారా అనే విషయం పరిశీలిస్తున్నారు. ఎవరికైనా అలాంటి లక్షణాలు ఉంటే వైద్యులు వారిని పరీక్షించి... కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే ఆసుపత్రికి పంపేలా చర్యలు తీసుకున్నారు. వార్డు వాలంటీర్లు ఆయా ఇళ్లలో ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చారా అని ఆరా తీస్తున్నారు. పోలీసు శాఖ తరపున ఆ ప్రాంతంలోకి మూడు గంటల పాటు బయటి వారు లోపలకు రాకుండా... ఎవరూ బయటకు పోకుండా చర్యలు చేపట్టారు.
మున్సిపల్ శాఖ తరపున పారిశుద్ధ్య సిబ్బంది అన్ని ప్రాంతాల్లో క్రిమీసంహారక మందును చల్లారు. రహదారులన్నీ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇలా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయటం ద్వారా కరోనాను ఎదుర్కోవచ్చని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు.
ఇదీ చూడండి సరిహద్దుల మూసివేతతో ఇబ్బందులు