Margadarsi Case Updates: మార్గదర్శి చిట్‌ఫండ్ బ్రాంచిల్లో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సోదాలకు ఏపీ హైకోర్టు అడ్డుకట్ట వేసింది. ఏపీలోని మార్గదర్శికి చెందిన 37 బ్రాంచిల్లో.. ఏ విధమైన సోదాలు చేయవద్దని ప్రభుత్వానికి, చిట్ రిజిస్ట్రార్లు, రిజిస్ట్రేషన్ శాఖ, సీఐడీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తనిఖీలు చేయాల్సి వస్తే చిట్‌ఫండ్ చట్టంలో సెక్షన్ 46 నిబంధనలు అనుసరించాలని.. సూచించింది. తెలంగాణ హైకోర్టు 2023 మే 11న ఇచ్చిన ఉత్తర్వులకు కట్టుబడి వ్యవహరించాలని స్పష్టం చేసింది. సోదాలు ముసుగులో.. మార్గదర్శి వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి ఆవరోధం కల్పించొద్దని.. న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
AP High Court Interim Orders in Margadarsi Case: మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థను మూసివేయడమే లక్ష్యంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్ర పూరితంగా తీసుకుంటున్న నిర్ణయాలను.. ఏపీలోని 37 బ్రాంచిల్లో ఈ నెల 17 నుంచి వివిధ శాఖల అధికారులు సోదాలు చేయడాన్ని సవాలు చేస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ ఆథరైజ్డ్ సిగ్నేటరీ పి.రాజాజీ.. హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల జరిగిన విచారణలో పిటిషనర్ సంస్థ తరఫున.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నాగముత్తు, ప్రభుత్వ, సీఐడీ తరఫు న్యాయవాదుల వాదనలు ముగిశాయి. దీంతో న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులపై బుధవారం నిర్ణయం ప్రకటించారు.
చిట్ చట్టంలోని సెక్షన్ 46 ప్రకారం.. చిట్ పుస్తకాలు, రికార్డులను చిట్ రిజిస్ట్రార్ లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆథరైజ్ చేసిన.. అధికారులు మాత్రమే తనిఖీ చేయాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. పనివేళల్లోనే తనిఖీలు చేపట్టాలని.. చట్ట నిబంధనలు చెబుతున్నాయన్నారు. ఈ ఏడాది ఆగస్టు 16న.. అధికారులు జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను పరిశీలిస్తే తనిఖీల నిమిత్తం అసిస్టెంట్ చిట్ రిజిస్ట్రార్‌గా వ్యవహరించేందుకు రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన కొందరు అధికారులు., సీనియర్ అసిస్టెంట్‌ను నియమించినట్లు కనబడుతోందన్నారు.
High Court Comments on Raids in Margadarsi: ఆగస్టు 17న నిర్వహించిన కొన్ని బ్రాంచిల తనిఖీల్లో అధికారులతో పాటు సీఐడీ, డీఆర్‌ఐ సిబ్బంది పాల్గొన్నారని పేర్కొన్నారు. చిట్‌ఫండ్ చట్టంలోని.. సెక్షన్ 61(2)ను అనుసరించి తనిఖీలు నిర్వహించేందుకు.. వేరే వ్యక్తులను నియమించే అధికారం డిప్యూటీ రిజిస్ట్రార్‌కు ఉందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదించినప్పటికీ.. ఈ నియామకాలను ‘చిట్స్‌ను తనిఖీలు చేసే ఇన్‌స్పెక్టర్లు’గా పరిగణించలేమని.. న్యాయమూర్తి తెలిపారు. ఆ విధంగా నియమించొచ్చా, అధికారాలను బదలాయించొచ్చా అనే అంశంపై లోతైన విచారణ చేయాల్సి ఉందన్నారు.
సెక్షన్ 46 ప్రకారం.. చిట్ పుస్తకాలు, రికార్డుల తనిఖీ కేవలం పనివేళల్లోనే చేపట్టాలని.. ఈ వ్యవహారంలో మరో అభిప్రాయానికి తావే లేదని.. హైకోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టు మే 11న జారీ చేసిన ఉత్తర్వుల్లో మార్గదర్శి, ఆ సంస్థ బ్రాంచిల్లో.. రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగించొద్దని నిర్దిష్ట ఆదేశాలిచ్చిందన్నారు. తనిఖీలు చేయాల్సి వస్తే.. కార్యాలయాల ప్రధాన ద్వారాలను మూసివేయొద్దని.. స్పష్టం చేసిందని పేర్కొన్నారు.
AP CID Chief Sanjay on Margadarsi: మార్గదర్శిపై ఫిర్యాదు చేయాలని మేమే చెబుతున్నాం: సీఐడీ చీఫ్ సంజయ్
High Court Questions to APCID in Margadarsi Case: ఈ నెల 17 నుంచి నిర్వహించిన తనిఖీలకు సంబంధించి కోర్టు ముందున్న ఆధారాలను పరిశీలిస్తే పనివేళలు ముగిసిన తర్వాత కూడా.. కొన్ని బ్రాంచిల్లో సోదాలు చేసినట్లు ప్రాథమికంగా స్పష్టమవుతోందన్నారు. అంతేకాక ఆథరైజ్ చేసిన కొంతమంది.. సోదాల్లో పాల్గొన్నారని న్యాయమూర్తి తెలిపారు. ఈ తనిఖీల్లో పోలీసులు, సీఐడీ అధికారులు.. పాల్గొన్నట్లు కనిపిస్తోందని.. వీరందరూ సోదాల్లో ఎందుకు పాల్గొన్నారని అడిగిన ప్రశ్నకు సీఐడీ, చిట్ రిజిస్ట్రార్ల నుంచి.. సంతృప్తికర సమాధానం రాలేదన్నారు. ఈ వ్యవహారంపై వివరణ ఇస్తూ ప్రతివాదులు.. కౌంటర్ దాఖలు చేయాల్సి ఉందని తెలిపారు.
ఆథరైజేషన్ కల్పించారనే కారణంతో కొంతమంది తనిఖీలు చేయడాన్ని సమర్థించలేమని.. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. చట్ట నిబంధనలకు విరుద్ధంగా చేసే.. ఎలాంటి తనిఖీలను అనుమతించలేమని.. న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అగౌరవపరిచేలా చేపట్టే తనిఖీలను ప్రోత్సహించలేమన్నారు. ఈ అంశాలతో పాటు.. కోర్టు ముందున్న రికార్డులను పరిగణనలోకి తీసుకుంటే.. మధ్యంతర ఉత్తర్వుల ద్వారా రక్షణ పొందేందుకు మార్గదర్శి తరఫు న్యాయవాది చేసిన వాదనతో.. న్యాయస్థానం ప్రాథమికంగా సంతృప్తి చెందుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో మార్గదర్శి బ్రాంచిల్లో.. ఏ విధమైన సోదాలు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులిస్తున్నామని.. న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.