సీఎం జగన్ ఇంటి ముట్టడికి యత్నించిన తెలుగునాడు విద్యార్థి సంఘాల నేతలకు మంగళగిరి కోర్టు రిమాండ్ విధించింది. వీరిని అరెస్టు చేసిన తర్వాత తాడేపల్లి పోలీసులు అత్యాచారం కేసు బనాయించారు. విద్యార్థి నేతలు అత్యాచారయత్నం చేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పరిశీలించిన న్యాయమూర్తి.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ రిమాండ్ రిపోర్ట్ సరిచేసి తీసుకురావాలని సూచించిన మేరకు.. పోలీసులు మరో నివేదికను సిద్ధం చేసి న్యాయమూర్తి ముందుంచారు.
విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. టీఎన్ఎస్ఎఫ్ నేతలకు రిమాండ్ విధించారు. ఈ నిర్ణయంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎప్పుడూ పేద విద్యార్థుల పక్షం పోరాడే తమపై.. తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. కేవలం నోటీసు ఇచ్చి పంపుతామని చెప్పి.. ఇలా రిమాండ్‌కు పంపడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎవరికీ ఆటంకం కల్పించకపోయినా.. పోలీసులు అన్యాయంగా తమపై కేసులు పెట్టారని వాపోయారు.
ఇదీ చదవండి: