సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు, వారిచ్చిన తీర్పులకు దురుద్దేశాలు, కులాలు, అవినీతి ఆరోపణలు ఆపాదిస్తూ.. వారి ప్రాణాలకు హాని కలిగిస్తామని బెదిరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారన్న అభియోగాలపై నమోదైన కేసులో కడపకు చెందిన లింగారెడ్డి రాజశేఖర్‌రెడ్డి (40) అనే వ్యక్తిని సీబీఐ శుక్రవారం అరెస్ట్ చేసింది. ఆయనను శనివారం గుంటూరులోని నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు (సీబీఐ డిజిగ్నేటెడ్ కోర్టు)లో హాజరుపరిచింది. న్యాయమూర్తి ఎస్.అరుణశ్రీ ఈ నెల 23 వరకు రిమాండ్ విధించారు. ఆయనను మూడు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ వేసిన పిటిషన్‌పై విచారణను ఈ నెల 12కి వాయిదా వేశారు.
నిందితుణ్ని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. కడప సరోజినీనగర్‌కు చెందిన రాజశేఖర్‌రెడ్డి మూడేళ్లుగా కువైట్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఇటీవలే సొంతూరికి తిరిగొచ్చారు. దర్యాప్తు అధికారి సంజయ్‌కుమార్ సమల్ ఆధ్వర్యంలో సీబీఐ అధికారులు రాజశేఖర్‌రెడ్డిని అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు తమ ఇంటర్వ్యూలు, ప్రసంగాలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా.. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు దురుద్దేశాలను ఆపాదిస్తూ, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారన్న అభియోగాలపై అప్పటి హైకోర్టు ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ ఫిర్యాదులు చేశారు. దీనిపై సీఐడీ (సైబర్ క్రైమ్) విభాగం 16 మంది వ్యక్తులు, గుర్తుతెలియని మరికొందరిపై 12 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. 2020 అక్టోబర్ 12న దర్యాప్తును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. అన్ని ఎఫ్‌ఐఆర్‌లనూ కలిపి.. ఒకే కేసు నమోదు చేసింది. దానిలో లింగారెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఏ-15గా ఉన్నారు.
పెద్ద వ్యక్తులెవరో ఆయనకు తెలుసు!
‘రాజశేఖర్‌రెడ్డి ఆధార్‌కార్డు, పాస్‌పోర్టుల్లో ఇంటి పేరు, పుట్టిన తేదీ వేర్వేరుగా ఉన్నాయి. పాస్‌పోర్టులో ఆయన పేరు తేరా రాజశేఖర్‌రెడ్డి అని ఉంది. ఆ పోస్టు తానే పెట్టానని, తాను వాడిన సెల్‌ఫోన్ బండేరు కోన వంకలో (నీటి ప్రవాహం) పడిపోయిందని, మరో ఫోన్ తన తల్లి దగ్గర ఉందని చెప్పారు. ఆయన ఫేస్‌బుక్ ఖాతా తెరవమని కోరగా యాక్టివ్‌గా లేదన్నారు. ఆ ఖాతా యాక్టివ్‌గానే ఉన్నట్టు తేలింది. ఆ పోస్టు లింకు తొలగించినట్లుగా ఉంది. అతని ఈ-మెయిల్ ఐడీ ద్వారా లాగిన్ అవ్వాలని కోరినా ఆయన వినియోగించిన ఫోన్లు అందుబాటులో లేకపోవడం సాధ్యం కాలేదు’ అని సీబీఐ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టుల వెనుక ఉన్న పెద్దలు ఎవరో రాజశేఖర్‌రెడ్డికి తెలుసని బలంగా అనుమానిస్తున్నామని సీబీఐ పేర్కొంది. వారెవరో, ఆ సెల్‌ఫోన్లు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు, ఆ పోస్టుల వెనుక ఉద్దేశమేంటో కనుక్కునేందుకు రాజశేఖర్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వాలంది.
న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టడంపై హైకోర్టు ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ జనరల్ 2020 మే 26న వ్యాజ్యం దాఖలు చేశారు. హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి, 93 మందికి నోటీసులు ఇచ్చింది. వారిలో వైకాపా ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్, ఆ పార్టీ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్, న్యాయవాదులు, పాత్రికేయులు ఉన్నారు. ఈ తరహా పరిస్థితులు దేశంలో ఎక్కడా చూడలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి హైకోర్టుపైనా, న్యాయమూర్తులపైనా చేసిన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థపై యుద్ధం ప్రకటించినట్టుగా ఉన్నాయని పేర్కొంది.
ఇదీ చదవండి:
Kathi Mahesh: నటుడు, సినీ విమర్శకుడు కత్తి మహేశ్ కన్నుమూత