ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పరిచయమై ప్రేమిస్తున్నానని నమ్మించి మోసగించాడంటూ ఓ సివిల్ ఇంజనీర్‌పై బాధిత యువతి సోమవారం గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ బాధితురాలికి న్యాయం చేయాలని అధికారులకు ఆదేశించారు. గుంటూరుకు చెందిన ఓ యువతి బీటెక్ చదివి విజయవాడలో హాస్టల్‌లో ఉంటూ బ్యాంకు ఉద్యోగ పోటీ పరీక్షకు సిద్ధమవుతోంది. ఆ హాస్టల్‌లో పరిచయమైన ఓ యువతి తన గ్రామస్థుడైన కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన మోహన్ అనే యువకుడిని ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా పరిచయం చేసింది. అప్పటినుంచి అతను ఆమెతో ఛాటింగ్ చేస్తూ.. తాను గుజరాత్‌లోని ఓ సంస్థలో సివిల్ ఇంజనీర్‌గా పని చేస్తున్నానని చెప్పాడు. ఆమెను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నమ్మించి సన్నిహితంగా ఉన్నాడు.
విజయవాడ వస్తున్నాను పెళ్లి విషయం మాట్లాడదామంటూ.. ఆన్‌లైన్‌లో ఓ హోటల్‌లో గదిని బుక్ చేసి అక్కడికి రావాలన్నాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవటంతో తాను చెప్పినట్లు హోటల్‌కు రాకపోతే ఆత్మహత్య చేసుకుని లేఖలో నీ పేరుపెడతానని, తామిద్దరమూ కలిసి తీయించుకున్న ఫోటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరించాడు. అక్కడకు వెళ్లిన ఆమెపై బలవంతం చేసి..త్వరలో పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆ తర్వాత మొహం చాటేశాడు. నిలదీస్తే ఏం చేసుకుంటావో చేసుకోమని అసభ్యకరంగా దుర్భాషలాడాడు. ఆమెకు అతన్ని పరిచయం చేసిన సదరు మహిళతో పాటు మోసగించిన మోహన్‌పై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ఆమె ఎస్సీని కోరారు.
అతని వల్ల నిశ్చితార్థం ఆగిపోయింది
వేరే వారిని పెళ్లి చేసుకుంటే తన వద్ద ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని యువకుడు బెదిరిస్తున్నాడని గుంటూరు రూరల్ ఎస్పీ కార్యాలయ స్పందనలో యువతి ఫిర్యాదు చేసింది. అతని వల్ల తన నిశ్చితార్థం ఆగిపోయిందంటూ వాపోయింది.
మాచర్లకు చెందిన యువతి ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో పని చేస్తుంది. అక్కడి సహోద్యోగి గుంటూరుకు చెందిన ఆంజనేయులు పరిచయమై ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. కొద్దిరోజులకు అతనికి వివాహమైందని తెలియడంతో అతనితో ఆమె దూరంగా ఉంది. తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయటానికి సంబంధం చూశారు. నిశ్చితార్థం చేసుకోవటానికి ముందురోజు వివాహం చేసుకోబోయే యువకుని వద్దకు ఆంజనేయులు వెళ్లి గతంలో తాము దిగిన ఫొటోలు, వీడియోలు ఉన్నాయని చూపించాడు. అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అవన్నీ సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరించాడు. ఆ తర్వాత బాధితురాలి దగ్గరకు వచ్చి తనను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకున్నా ఆమె జీవితం నాశనం చేస్తానని హెచ్చరించాడు. అతనిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని యువతి ఎస్పీని కోరారు.
ఇదీ చదవండి: 'న్యాయమూర్తులపై వ్యాఖ్యల కేసులో కుట్రకోణం ఉంటే తేల్చండి'