కృష్ణానది వరద ఉద్ధృతికి గుంటూరు జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపొర, కొల్లూరు మండలాల పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. భారీవర్షాలకు దెబ్బతిన్న పసుపు, మినుము, అరటి పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులు పెట్టిన పెట్టుబడులు, జరిగిన నష్టం గురించి ఆరా తీశారు. వర్షాలు, వరదలతో అన్నదాతలు అన్యాయమైపోతుంటే.. ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రికి కనీసం పరామర్శించే తీరిక లేదా అని ప్రశ్నించారు. రైతు రాజ్యం తెస్తానని పాదయాత్ర సమయంలో ప్రగల్భాలు పలికిన సీఎం జగన్ రెడ్డి.. ఇపుడు రైతులేని రాజ్యం తెస్తున్నారని ఎద్దేవా చేశారు.
రైతులను అడుగడుగునా జగన్ సర్కార్ అవమానిస్తోందని నారా లోకేష్ ఆరోపించారు. రైతులు టీషర్టులు వేసుకున్నా.. సెల్ ఫోన్లు వాడినా కించ పరుస్తూ మాట్లాడటమే దీనికి నిదర్శమని అభిప్రాయపడ్డారు. వర్షాలు, వరదలతో 11 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని.. 14 మంది చనిపోయి, 8 వేల ఇళ్లు నీట మునిగినా ముఖ్యమంత్రి కనీసం బాధితుల్ని పలకరించకపోవటం దారుణమన్నారు. పంటనష్టం అంచనా వేయడానికి ఈ ప్రభుత్వానికి తీరిక లేదా అని ప్రశ్నించారు. ఆర్భాటంగా ప్రకటించిన 4 వేల కోట్ల ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఎక్కడని ప్రశ్నించారు.
తన గొప్పలకు చేసిన అప్పుల కోసం ఉచిత విద్యుత్‌కి ఎసరు పెడుతున్నారని విమర్శించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల పేరుతో ఉచిత విద్యుత్‌కి మంగళం పాడేందుకు జగన్ సర్కారు సిద్ధమైందని ఆరోపించారు. ఉచిత విద్యుత్ కొనసాగింపుపై రైతుల తరఫున తెదేపా పోరాడుతుందని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత.. 750 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకోవడం సిగ్గుచేటన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో వ్యవసాయ బడ్జెట్ 6వేల కోట్ల నుంచి 19వేల కోట్లకు పెంచితే.. జగన్‌రెడ్డి సర్కారు వ్యవసాయానికి ఏడాదికి 7 వేల కోట్లు కూడా ఖర్చుచేయలేదన్నారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనే పరిస్థితి లేదని.. అలాగే గిట్టుబాటు ధరలు లభించటం లేదని అన్నారు. 2 వేల కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించకుండా కాంట్రాక్టర్లకు 6 వేల 400 కోట్లు చెల్లించినప్పుడే జగన్ సర్కారు ఎవరి పక్షమో తెలిసిపోయిందన్నారు.
దుగ్గిరాల మండలం పెదకొండూరులో వరద బాధితులకు నిత్యావసర సరుకులను లోకేశ్ అందజేశారు. ఈ పర్యటనలో నారా లోకేష్ వెంట ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, తెదేపా నాయకులు ఆలపాటి రాజా, నక్కా ఆనంద్ బాబు, తెనాలి శ్రవణ్ కుమార్ ఉన్నారు.
ఇదీ చదవండి: బిహార్ బరి: 12 బహిరంగ సభల్లో మోదీ ప్రచారం