రాష్ట్రంలో ఇసుక కొరతతో ఇబ్బందులు పడుతున్న భవన కార్మికలకు మద్దతుగా, తెదేపా నేతలు మంగళగిరిలో ధర్నా ఏర్పాటు చేశారు. ఈ ధర్నాలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పాల్గొన్నారు. మంగళగిరి పాత బస్టాండ్ వద్ద మూసివేసిన అన్న క్యాంటీన్ వద్ద బైఠాయించిన తెదేపా నేతలు ముఖ్యమంత్రిని విమర్శిస్తూ , పేదల రాజ్యాన్ని పులివెందుల రాజ్యం చేశారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ధర్నాలో భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని లోకేశ్ వద్ద తమ గోడును వెల్లబోసుకున్నారు. . ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తుందంటూ ధ్వజమెత్తారు. కొత్త ప్రభుత్వం వచ్చి మూడు నెలల అయితే రాష్ట్రం మూడు సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇసుక ధరలు పెరిగిపోయాయని అన్నారు. అవినీతి పుత్రుడు, తండ్రిని అడ్డుపెట్టుకొని దేశాన్ని దోచేసిన ఆయన ఇప్పుడు ఇసుకను తింటున్నారంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేశారు. రాజధానిపై రోజుకొక మాట మారుస్తున్నారనీ, భవన నిర్మాణ కార్మికులు, ఇసుక పై ఆధారపడి బతుకుతున్న వారు రోడ్డు పై పడ్డారని తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవటానికి ప్రవేశ పెట్టిన చంద్రన్న బీమా, పేదలకు అక్షయ పాత్ర అయిన అన్న క్యాంటీన్లను ఆపేసారని వివరించారు. 8 లక్షల భవన నిర్మాణ కార్మికులందరకీ అరవై వేల రూపాయలిచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : 'తోపులాటలో రైతుల మృతిపై ప్రభుత్వానిదే బాధ్యత'