100 Services Through WhatsApp in AP : ప్రభుత్వ సేవలను ప్రజలకు మరితం సులభతరం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. నవంబర్ 30 నుంచి వంద రకాల సేవలను ఒక్క క్లిక్‌తో అందుబాటులోకి తెచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. రేషన్ కార్డుల జారీ, రిజిస్ట్రేషన్‌కు స్లాట్ బుకింగ్, పంటల మార్కెట్ ధరలు, దైవదర్శనాలు, విద్యార్థుల హాజరు, ఇలా ఎన్నో రకాల సేవలను వాట్సాప్ బిజినెస్ సర్వీస్ వేదిక ద్వారా ఇట్టే పొందే వెసులుబాటు తీసుకొస్తోంది.
యువగళం పాదయాత్రలో భాగంగా సర్టిఫికెట్ల కష్టాలు తప్పిస్తానని హామీ ఇచ్చిన లోకేశ్ ఆ దిశగా ముమ్మర చర్యలు చేపట్టారు. వివిధ రకాల పౌరసేవలు ఎంతో సులభతరం చేసేందుకు వాట్సాప్ మాతృ సంస్థ మెటాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా వాట్సాప్ బిజినెస్ సర్వీస్ డెలివరీ వేదికగా పలు రకాల పౌరసేవలు పొందే వెసులుబాటు ప్రజలకు లభిస్తుంది. మూడు ప్రాథమిక విధానాల్లో సేవలు అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది. సర్కార్ నుంచి పౌరులకు, వ్యాపారం నుంచి వినియోగదారుడికి, ప్రభుత్వంలోని విభాగాల నుంచి విభాగాలకు సేవలు అందిస్తుంది.
WhatsApp Governance in AP : మొదటి దశలో వాణిజ్య రంగంలో సమర్థవంతమైన ప్రభుత్వ సర్వీసు డెలివరీ కోసం రీ- ఇంజినీరింగ్ ప్రక్రియ, విధానాలను అమలు చేస్తారు. రెండో దశలో ఎలాంటి ప్రతిబంధకాలు లేకుండా సులభతరంగా పౌరసేవలు అందిస్తారు. గ్రామ వార్డు సచివాలయాల్లో 29 విభాగాల్లో 350కు పైగా సేవలు ఇప్పటికే ఏకీకృతం చేశారు. వివిధ విభాగాలను అనుసంధానించడం ద్వారా ఇతర సేవలను అందుబాటులోకి తెస్తారు.
వాట్సాప్ గంటకు 10 లక్షల అలర్ట్‌ల సామర్థ్యంతో రియల్‌టైమ్ నోటిఫికేషన్లు ఇస్తుంది. పర్యాటక రంగానికి సంబంధించి అవసరమైన ప్రయాణ సమాచారం అందుబాటులోకి వస్తుంది. పౌరులు తమ సమస్యలను తెలియజేసేందుకు వేదికగా పనిచేస్తుంది. దేవాదాయ శాఖకు సంబంధించి రాష్ట్రంలోని 7 ప్రధాన దేవాలయాల్లో దర్శనం, వసతి, విరాళాలు, వివిధ రకాల సేవల కోసం స్లాట్‌లను బుక్ చేసుకోవచ్చు. ఈ సేవలన్నీ వాట్సాప్ ద్వారా అందుబాటులోకి వస్తాయి.
రేషన్ కార్డుల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదలయ్యాక రేషన్ కార్డుల జారీ, రేషన్ పంపిణీ పరిస్థితి అప్‌డేట్ వంటి సేవలు అందుతాయి. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో ఆస్తి పన్ను చెల్లింపు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, వాణిజ్య లైసెన్సులు వంటి సేవలు వాట్సాప్ ద్వారా పొందవచ్చు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి వాట్సాప్ సాంకేతిక భాగస్వామిగా సేవలను అభివృద్ధి చేస్తారు. భద్రతను నిర్థారించే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి సకాలంలో నోటిఫికేషన్లు, సర్టిఫికెట్ల జారీ, రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్ ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ దరఖాస్తు చేసుకోవచ్చు.
వాట్సాప్ ద్వారా వివిధ సేవలు : వాట్సాప్ ద్వారానే విద్యుత్ బిల్లులు చెల్లించొచ్చు. ప్రజల అభ్యర్థనల మేరకు జియో లోకేషన్ ఆధారంగా కొత్త హై టెన్షన్ లైన్‌లు, పవర్ ట్రాన్స్ ఫార్మర్‌లను ఏర్పాటు చేయడం, ట్రాన్స్‌కో, అంతర్గత కమ్యూనికేషన్, అలర్ట్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. అన్ని రవాణా లైసెన్సులకు సంబంధించిన సేవలు, అనుమతులు ఇప్పటికే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. వినియోగదారుల సౌలభ్యాన్ని మెరుగుపరచడం కోసం వాటిని వాట్సాప్‌తో ఏకీకృతం చేస్తారు.
దిల్లీ రవాణా సంస్థ మాదిరిగా ఏపీఎస్ఆర్టీసీతో మెటా బృందం కలిసి పనిచేస్తుంది. టికెట్ బుకింగ్, పార్శిల్ బుకింగ్‌ల కోసం ఆర్టీసీ సేవలను ఏకీకృతం చేస్తారు. విద్యార్థుల హాజరు, పనితీరుకు సంబంధించి తల్లిదండ్రులకు సమాచారం అందించేందుకు మొబైల్ నంబర్‌తోపాటు ఆధార్ ప్రామాణీకరణతో సంక్షిప్త సందేశం విధానం అందుబాటులోకి వస్తుంది. పాఠ్య ప్రణాళిక ఫలితాలను ట్రాక్ చేయడంతోపాటు మెటా బృందం అదనపు కోర్సులను అందుబాటులోకి తెస్తుంది. ఉన్నత విద్యలో ప్రవేశ పరీక్షలు, ప్రవేశాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
AP Government MoU With META : విద్యార్థి - సిబ్బంది సేవలు, వర్చువల్ బోధన సహాయం, కమ్యూనికేషన్, నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడానికి అభ్యసన మేనేజ్‌మెంట్ సిస్టం వంటివి అందుబాటులోకి వస్తాయి. విద్యా సేవలకు అంతరాయం లేని యాక్సెస్ కోసం అపార్ ఐడీని అనుసంధానిస్తారు. డ్రగ్స్, పొగాకు రహిత క్యాంపస్ కోసం ప్రచారాలు, విశ్వవిద్యాలయాల్లో వివిధ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు చేసుకునే సౌలభ్యం లభిస్తుంది.
ప్రభుత్వ ప్రమాణాలకు అనుకూలంగా ఉండే పలు రకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అందుబాటులోకి వస్తాయి. నైపుణ్య గణనకు మెటా సహకారం అందిస్తుంది. పరిశ్రమల శాఖ ఇప్పటికే ఔట్‌రీచ్ కమ్యూనికేషన్ కోసం చాట్‌బాట్‌లను ఉపయోగిస్తోంది. వ్యవస్థాపకుల కోసం సింగిల్ డెస్క్ పోర్టల్‌ను ఏకీకృతం చేయడానికి విధివిధానాలు సిద్ధమయ్యాయి. భూ కేటాయింపు కోసం దరఖాస్తు, పెట్టుబడి విధానం, ప్రచారం వంటి వాటికి అవకాశం లభిస్తుంది. రాష్ట్రంలో అమలవుతున్న ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు, రహదారి పరిస్థితులపై రెగ్యులర్ అప్‌డేట్‌లు అందిస్తుంది. వ్యవసాయ రంగానికి సంబంధించి మార్కెట్ ధరలు, వాతావరణం, ఉత్తమ యాజమాన్య నిర్వహణ పద్ధతులపై సమాచారం పొందవచ్చు.
ఏపీ పెట్టుబడుల స్వర్గధామం - పెట్టుబడిదారులకు వాట్సప్‌లో అప్డేట్స్ : లోకేశ్