Lok Adalat Conducted across the State: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్‌లకు విశేష స్పందన లభించింది. ఒక్క రోజే లక్షా 51 వేల 261కి పైగా కేసులు పరిష్కారం అయ్యాయి. 42.86 కోట్ల రూపాయలు పరిహారం అందజేశారు. పరిష్కారం అయిన లక్షా 51 వేల 261 కేసుల్లో లక్షా 25 వేల 733 కేసులు పెండింగ్, 25 వేల 528 ప్రిలిటిగేషన్ కేసులున్నాయి. జాతీయ న్యాయసేవాధికార సంస్థ అదేశాల మేరకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, ఏపీ న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వహణ అధ్యక్షులు జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ మారదర్శకాల్లో.. రాష్ట్రంలోని దిగువ న్యాయస్థానాల్లో.. శనివారం 411 లోక్ అదాలత్ బెంచ్‌లు నిర్వహించారు.
రాజీకి అవకాశం ఉన్న పలుకేసుల్ని ఇరువరాల మధ్య సామరస్య పూర్వకంగా పరిష్కరించారు. హైకోర్టు ప్రాంగణంలో ఏపీ హైకోర్టు న్యాయసేవల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ కె.మన్మథరావు, జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు పాల్గొన్నారు. 201 కేసులను పరిష్కరించారు.
5.26 కోట్ల రూపాయలను పరిహారం అందజేశారు. లోక్ అదాలత్ నిర్వహణను పరిశీలించడానికి హైకోర్టుకు వచ్చిన కేఎల్ న్యాయ కళాశాల విద్యార్థులకు.. ఏపీ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్ జస్టిస్ ఏవీ శేషసాయి.. న్యాయసేవల చట్టం, న్యాయ సహాయం, లోక్ అదాలత్‌లపై అవగాహన కల్పించారు. లోక్ అదాలత్ విజయవంతం కావడానికి సహకరించిన న్యాయవాదులు, కక్షిదారులు, అధికారులకు ఏపీ న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి ఎం.బబిత, హైకోర్టు న్యాయసేవల కమిటీ కార్యదర్శి ఎం.గురునాథ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చదవండి: