గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్నారై వైద్య కళాశాలలో ఒక వర్గం డైరెక్టర్లను వారి ఛాంబర్లలోకి వెళ్లకుండా మరో వర్గం అడ్డుకోవడం, వారి నివాస క్వార్టర్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ముక్కామల అప్పారావు వర్గానికి చెందినవారు తమ ఛాంబర్లకు తాళాలు వేసి అడ్డుకున్నారని పోలవరపు రాఘవరావు అధ్యక్షుడిగా ఉన్న కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాముంటున్న నివాసాలకు గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిపివేశారని వివరించారు. ఇది మంచి పద్ధతి కాదని తమ కమిటీ ఉపాధ్యక్షుడు ఉపేంద్రనాథ్ హెచ్చరించాక మళ్లీ విద్యుత్ సరఫరా పునరుద్ధరించారని, ఛాంబర్లలోకి అనుమతించారని పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌ఐలో శుక్రవారం జరిగిన పరిణామాలను రాఘవరావు అధ్యక్షుడిగా ఉన్న కమిటీ కోశాధికారి డాక్టర్ అక్కినేని మణి వివరించారు.
‘మమ్మల్ని అడ్డుకునేందుకు ఆసుపత్రి ప్రవేశద్వారం, మా ఛాంబర్ల వద్ద రౌడీలను పెట్టి హడావుడి చేశారు. వైద్యం కోసం వచ్చిన వారు ఇదంతా చూసి ఏం జరుగుతుందోనని ఆందోళన చెందారు. ఇక్కడి పరిణామాలు మమ్మల్ని భయపెడుతున్నాయి. 18ఏళ్లు కష్టపడి ఆసుపత్రిని అభివృద్ధి చేసిన మమ్మల్ని లోనికి రానివ్వకపోవడం ఆవేదన కలిగించింది. నేను 40 ఏళ్లకుపైగా అమెరికాలో ఉన్నా. అమెరికా పౌరసత్వం ఉంది. రక్షణ కల్పించడంలో సాయపడగలరా? అని ఈమెయిల్ ద్వారా అక్కడి అధికారులను కూడా కోరా. వారిని ఫోన్‌లోనూ సంప్రదిస్తా’ .-కమిటీ కోశాధికారి డాక్టర్ అక్కినేని మణి
ఇదీ చదవండి: