కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా రేపటి నుంచి గుంటూరులో లాక్ డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తామని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ప్రకటించారు. జిల్లాలో 30 కేసులు నమోదు కాగా... వాటిలో 15 కేసులు గుంటూరు నగరంలోనే నమోదయ్యాయని తెలిపారు. రేపు ఉదయం నుంచి గుంటూరు మీదుగా ఇతర ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిషేధించినట్లు ఆనంద్ కుమార్ వెల్లడించారు.
నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలతో కలిసి జీజీహెచ్‌ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా జీజీహెచ్ సిబ్బందికి మాస్కులు, గ్లౌజులను ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పంపిణీ చేశారు. వైద్యసిబ్బందికి 2వేల పీపీఈ కిట్లను విజ్ఞాన్ సంస్థల తరపున జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజునాయుడికి అందించారు.
గుంటూరులో లాక్ డౌన్‌కు సహకరించాలని ప్రజలను కలెక్టర్ కోరారు. నిషేదాజ్ఞలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యావసర సరకులను తామే అందజేస్తామన్నపాలనాధికారి.. ఎవరూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. వైద్యసేవలన్నీ ఎస్మా చట్టం పరిధిలోకి వచ్చినందున ప్రైవేటు వైద్యసిబ్బంది సైతం సహకరించాలని ఆదేశించారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నవారికి అన్ని ఏర్పాట్లు చేశామని.. ఎవరూ దుష్ప్రచారం చేయవద్దని కోరారు.
ఇదీ చదవండి.