నల్లపాడులోని అనసూయాంబ నగర్లో సర్వే నంబర్ 563/5 లో 8ఎకరాల 74 సెంట్లలో 101 ప్లాట్లు ఉన్నాయి. 1969లో ఆళ్ల సత్యనారాయణరెడ్డి అనే వ్యక్తి ఈ వెంచర్ వేసి ప్లాట్లుగా విక్రయించారు. అప్పటి నుంచి ప్లాట్లు చాలామంది చేతులు మారాయి. కొందరు ఇక్కడ ఇళ్లు కట్టించుకుని నివాసం ఉంటున్నారు. అయితే ఈ భూమిని వ్యవసాయ భూమిగా చూపిస్తూ రెవెన్యూ అధికారులు అడంగల్‌లో మార్పులు చేశారు. చల్లా చలమారెడ్డి భార్య అచ్చమ్మ పేరిట స్థలం ఉన్నట్లు పేర్కొన్నారు.
ముప్పై, నలభై సంవత్సరాలుగా ప్లాట్లు తమ పేరిట ఉంటే ఇపుడు వేరే వ్యక్తుల పేరిట అడంగల్ ఎలా ఇస్తారని స్థలం యజమానులు ప్రశ్నిస్తున్నారు. తమ వద్ద రిజిస్ట్రేషన్ పత్రాలు, ఈసీ ఉన్నాయని అంటున్నారు. ఇటీవల రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి విచారణకు వచ్చినపుడు కూడా అన్ని పత్రాలు చూపామని... అయినా ఇపుడు భూమి వేరేవారి పేరిట అడంగల్ ఇవ్వటాన్ని తప్పుబడుతున్నారు.
తాత, తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన స్థలాన్ని వదులుకోలేమని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో అధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 2012లోనే సొసైటీగా రిజిస్ట్రేషన్ అయిందని... అన్ని రకాల పన్నులు కూడా చెల్లిస్తున్నట్లు ప్లాట్ల యజమానులు తెలిపారు.
ఇదీ చదవండి: కొండకావూరులో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ