Lack of Facilities in Libraries in Andhra Pradesh: యువతకు అక్కరకు వచ్చే గ్రంథాలయాలు వైసీపీ పాలనలో నిర్వీర్యమవుతున్నాయి. నిర్వహణకు సరిపడా నిధులు సర్కారు ఇవ్వడం లేదు. చాలా చోట్ల ఫర్నిచర్ అందుబాటులో లేదు. టేబుళ్లు, కుర్చీలు లేక పాఠకులు ఇబ్బందులు పడుతున్నా సర్కారుకు పట్టడం లేదు.
రాష్ట్రంలో గ్రంథాలయాలను ప్రభుత్వం గాలికి వదిలేసింది. వాటి నిర్వహణను పట్టించుకోవడం లేదు. విజయనగరం గ్రంథాలయంలో పాఠకులు నేలపై కూర్చుని చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు అన్ని రకాల పుస్తకాలూ అందుబాటులో లేవు. వారి అవసరాలకు అనుగుణంగా సమకూర్చేందుకు సర్కారు నిధులు ఇవ్వడం లేదు. పేపర్ బిల్లులు, ఇతరత్రా వ్యయాన్ని ప్రభుత్వమే భరించాల్సి ఉన్నప్పటికీ జిల్లా గ్రంథాలయాల నిధులనే వాడేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలోని చాలా గ్రంథాలయాల్లో దర్శనమిస్తోంది.
గ్రంథాలయాల అభివృద్ధిపై ప్రభుత్వం చిన్నచూపు - నిధులేవి జగనన్నా?
జీతాలు సక్రమంగా అందించడం లేదు: గ్రంథాలయాల్లో పనిచేసే రెగ్యులర్, పార్ట్‌టైమ్, పొరుగుసేవల ఉద్యోగులకు జీతాలను ప్రభుత్వం సక్రమంగా చెల్లించడం లేదు. ఏటా 100 కోట్ల వరకు నిధులు అవసరం. ఇది కాకుండా పదవీ విరమణ చేసిన పింఛన్‌దారులకు మరో 30 కోట్లు కావాలి. ఈ మొత్తాన్నీ ప్రభుత్వం విడుదల చేయడం లేదు.
పన్నుల నుంచే జీతాలు: రాష్ట్రంలో మంజూరైన 2 వేల 217 పోస్టులకు గానూ ఒక వెయ్యి 95 మంది మాత్రమే పని చేస్తున్నారు. వారిలో రెగ్యులర్ సిబ్బంది 737 మంది మాత్రమే. సిబ్బంది కొరతతో ఒక్కో లైబ్రేరియన్ రెండు, మూడు గ్రంథాలయాలకు బాధ్యతలు వహిస్తుండగా.. నాలుగున్నరేళ్లల్లో ఒక్క పోస్టూ సీఎం జగన్ భర్తీ చేయలేకపోయారు. రెండేళ్లుగా సిబ్బంది జీతాలకు నిధులు ఇవ్వకపోవడంతో పన్నుల నుంచే జీతాలు చెల్లిస్తున్నారు. ఏదైనా జిల్లాలో పన్నుల గ్రాంటు సరిపోకపోతే ఇతర జిల్లాల నుంచి సర్దుబాటు చేస్తున్నారు.
స్థానిక సంస్థల నుంచి వాటా అందడం లేదు : రాష్ట్ర, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ల జీత, భత్యాలకూ వాటి నుంచే ఇస్తున్నారు. వారి గౌరవ వేతనం 30 వేలు, నెలకు కారు ఎలవెన్సు 35 వేలను పన్నుల నుంచే చెల్లిస్తున్నారు. పన్నుల ఆదాయాన్ని గ్రంథాలయాల అభివృద్ధికి వినియోగించాల్సిన జగన్ ప్రభుత్వం ఆ నిధులను జీతభత్యాలకు మళ్లించేస్తోంది. మరోవైపు పన్నులను వసూలు చేస్తున్న స్థానిక సంస్థలు, అందులోని వాటాను గ్రంథాలయాలకు సక్రమంగా ఇవ్వడం లేదు. విశాఖపట్నం కార్పొరేషన్ 100 కోట్లు, విజయవాడ కార్పొరేషన్ 21 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంది. స్థానిక సంస్థల నుంచి గ్రంథాలయాలకు పన్నుల నిధులు 700 కోట్ల వరకు రావాలి.
రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, గ్రామీణ, ఇతర గ్రంథాలయాలు 11 వందల 58 ఉండగా, వీటిల్లో 120 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మరో 291 అద్దెలేని ఇతర భవనాల్లో నడుపుతున్నారు. అవి కూడా చాలా చోట్ల మరమ్మతులకు గురయ్యాయి. వాటి నిర్వహణను సర్కారు పట్టించుకోవడం లేదు.
వైసీపీ సర్కారు నిర్లక్ష్య వైఖరి, వృధాగా డిపోల్లో ఎర్రచందనం నిల్వలు