శివరాత్రి ఉత్సవాల్లో కోటప్పకొండకు రాష్ట్రవ్యాప్త గుర్తింపు ఉంది. మహాశివరాత్రిని.. ఇక్కడ తిరునాళ్లలా జరుపుతారు. అందుకే కోటప్పకొండ- కోటివేల్పుల అండ అంటూ భక్తులు... ఇక్కడకు లక్షలాదిగా..తరలివస్తారు. మహిళలు పొంగళ్లు పెట్టి మొక్కులు చెల్లించుకుంటారు. శివుడికి ప్రత్యేక అభిషేకాలు చేయించుకుంటారు.
శివరాత్రికి గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి ట్రాక్టర్లు, లారీలు, ఇతర వాహనాల్లో పెద్ద సంఖ్యలో కోటప్పకొండకు వస్తారు. ఏటికేడు జాతరకు జనం పెరగడమేకాని తగ్గిందిలేదు. అందుకు తగ్గట్లే త్రికూటాద్రి కొత్తరూపు సంతరించుకుంది. కొండపై బాలానందం, కాళింది మడుగు, పుష్పవనానికి రంగులద్దారు. కొండ దిగువన వందల సంఖ్యలో బొమ్మల దుకాణాలు కొలువుదీరాయి.
శివరాత్రి అంటేనే జాగారం. కోటప్పకొండలో దానికి కొదవేలేదు. భక్తులను రాత్రంతా అలరించేందుకు మరెక్కడాలేని విధంగా ఇక్కడ ఎలక్ట్రిక్ ప్రభలు అలరిస్తాయి. 90 నుంచి వంద అడుగుల ఎత్తైన ప్రభలను త్రికోటేశ్వరుని చెంతకు చేర్చుతారు. వాటికి జిగేల్‌మనిపించే లైటింగ్‌ను ఆకర్షణీయంగా అమరుస్తారు. అక్కడే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. భక్తులు రాత్రంతా అక్కడే జాగారం చేస్తారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేశామని.. వచ్చే ఏడాది రోడ్లును విస్తరిస్తామని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఏడాది కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా భద్రతను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: మూల స్థానేశ్వరస్వామి సన్నిధిలో కంచి కామకోటి పీఠాధిపతి