BJP LEADER KANNA LAXMI NARAYANA : కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీకి రాజీనామా చేస్తారన్న వార్తలపై సందిగ్ధం వీడింది. భారతీయ జనతా పార్టీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. గుంటూరులోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశం అనంతరం ఈ నిర్ణయాన్ని కన్నా ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం సరిగా లేకనే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. కన్నాతో పాటు పలువురు ముఖ్య నేతలు తమ రాజీనామాలను ప్రకటించారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిపారు.
అయితే రాజీనామా అనంతరం ఏ పార్టీలో చేరతారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. గతంలో కూడా కన్నా పార్టీ మారుతున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. ఒకసారి తెలుగుదేశంలోకి వెళ్లనున్నారని కూడా చర్చనీయాంశమైంది. మరొసారి జనసేనలోకి వెళ్లనున్నారని కూడా పుకారు వచ్చింది. కానీ అవేమీ జరగలేదు. మరి ఈసారి ఏ పార్టీ అనేది తెలియాల్సి ఉంది. ఈ రోజు తన ముఖ్య అనుచరులతో కన్నా లక్ష్మీ నారాయణ సమావేశం అయ్యారు. గుంటూరులోని ఆయన నివాసంలోనే ఈ సమావేశం ముగిసింది.
సమావేశం అనంతరం పార్టీకి రాజీనామా ప్రకటించారు. ఏ పార్టీలో చేరేది తర్వాత స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని అనుచరులు చెబుతున్నారు. ఇటీవల కన్నా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. సోమవారం అమరావతిలో జరిగిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటనలో సైతం ఆయన పాల్గొనలేదు.
గుంటూరు జిల్లా రాజకీయాల్లో గత దశాబ్ధాలుగా కన్నా కీలకంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన కన్నా.. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దాదాపు 15 సంవత్సరాల పాటు మంత్రిగా పని చేశారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నుంచి 4సార్లు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఓసారి గెలిచారు. కన్నాకు జిల్లాలో విస్తృతమైన పరిచయాలు, భారీ అనుచరగణం ఉంది. 2019లో అత్యంత క్లిష్టమైన సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన అధ్యక్షునిగా ఉన్న సమయంలోనే జనసేన.. బీజేపీతో పొత్తు పెట్టుకుంది.
అప్పట్లో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని రెండు పార్టీలు కలిసి నడిచాయి. పవన్ కల్యాణ్ వంటి జనాకర్షణ కలిగిన నాయకుడు , కేంద్రంలో మోదీ ప్రభుత్వం కలిపి రాష్ట్రంలో రెండు పార్టీలు బలమైన శక్తిగా ఉండాలని కన్నా భావించారు. అయితే.. రాష్ట్ర అధ్యక్ష పదవీకాలం ముగిసిన తర్వాత అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడటం తీవ్ర అసంతృప్తికి గురి చేసిందనే చెప్పొచ్చు. ఓవైపు జనసేన పార్టీతో సంబంధాలు బలహీనం కావటం, రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కాకపోవటంతో ఏం చేయాలనే మల్లగుల్లాలు పడ్డారు. ప్ర సోము వీర్రాజు వల్లే ఈ పరిస్థితి వచ్చిందని బహిరంగంగా కన్నా వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: