Kanna Lakshminarayana Comments on Somu Veerraju: రాష్ట్ర బీజేపీలో వర్గపోరు బయటపడుతోంది. తాజాగా జిల్లా అధ్యక్షుల తొలగింపుతో అది మరోసారి బహిర్గతమైంది. తమను కాదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఆయన వైఖరి వల్లే గతంలో ఉన్న క్యాడర్ ఇప్పుడు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పును తప్పుబట్టిన కన్నా లక్ష్మీనారాయణ.. సోము వీర్రాజు తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కోర్ కమిటీలో చర్చ లేకుండానే జిల్లా అధ్యక్షులను మార్చారంటూ ఆరోపించారు.
ఆయా జిల్లాల అధ్యక్షుల మార్పుపై తనతో చర్చించలేదని పేర్కొన్నారు. తన సమయంలో నియమించిన వారిని ఇప్పుడు తొలగిస్తున్నారని కన్నా ఆరోపించారు. కోర్ కమిటీ సమావేశం తప్ప.. పార్టీలో ఏ సమాచారం తెలియట్లేదని బహిరంగంగా విమర్శించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలామందిని పార్టీలో చేర్చాననీ, అయితే ఇప్పుడు వాళ్లంతా ఎందుకు పార్టీ వీడుతున్నారో వీర్రాజు సమాధానం చెప్పాలని కన్నా మండిపడ్డారు.
తన వియ్యంకుడు బీఆర్ఎస్లో ఎందుకు చేరారో వీర్రాజు చెప్పాలని కన్నా ప్రశ్నించారు. ఎంపీ జీవీఎల్ ఆలోచన స్థానిక కార్యకర్తల అభిప్రాయాలకు ఎప్పుడూ భిన్నంగా ఉంటుందని తెలిపారు. అమరావతి రాజధానితో సహా అనేక అంశాల్లో జీవీఎల్ వైఖరి చూస్తున్నామని ఆయన వెల్లడించారు. జగన్-కేసీఆర్ కుట్రలో భాగంగానే బీఆర్ఎస్లోకి ఏపీ నేతలు వెళ్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఏపీలో పవన్, తెలంగాణలో బండి సంజయ్‌ను బలహీనం చేసే కుట్రలో భాగంగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కాపు నేతలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టిందని.. కన్నా లక్ష్మీనారాయణ వారిని తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. పవన్‌కు మేమంతా అండగా ఉంటామని కన్నా లక్ష్మీనారాయణ పునరుద్ఘాటించారు.
కోర్ కమిటీలో చర్చ లేకుండానే జిల్లా అధ్యక్షులను మార్చారు. అధ్యక్షుల మార్పుపై నాతో చర్చించలేదు. కోర్ కమిటీ సమావేశం తప్ప పార్టీలో ఏ సమాచారం తెలియట్లేదు. జగన్-కేసీఆర్ కుట్రలో భాగంగానే బీఆర్ఎస్లోకి ఏపీ నేతలు వెళ్తున్నారు. అలాగే తెలంగాణలో బండి సంజయ్‌నీ, ఆంధ్రప్రదేశ్‌లో పవన్‌ను బలహీనం చేసే కుట్రలో భాగంగా ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసమే కాపు నేతలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. వారిని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాపునేతలు వీరి ట్రాప్‌లో పడొద్దు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ నేత
ఇవీ చదవండి: