Jada Sravan Arrested: అమరావతి రైతులకు మద్దతుగా జై భీమ్ భారత్ పార్టీ తలపెట్టిన పాదయాత్రను పోలీసులు భగ్నం చేశారు. న్యాయం కోసం నేను సైతం పేరిట పాదయాత్ర చేయాలని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ నిర్ణయించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులతో కలిసి తుళ్లూరులో అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి అక్కడ నుంచి పాదయాత్రగా బయలుదేరి అంబేడ్కర్ స్మృతివనం వరకు చేరుకుని- అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వాలని నిశ్చయించుకున్నారు.
ఉదయం ఏడున్నర గంటలకు విజయవాడ గాంధీ నగర్‌లోని జై భీమ్ భారత్ పార్టీ కార్యాలయం నుంచి తన మద్దతుదారులతో కలిసి బయలుదేరేందుకు శ్రవణ్‌కుమార్ సిద్ధమయ్యారు. పార్టీ కార్యాలయానికి రావడానికి ముందు అక్కడికి చేరువలోని హోటల్ హరిప్రియలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో పోలీసులు హోటల్‌ను చుట్టుముట్టారు. జై భీమ్ భారత్ పార్టీ మద్దతుదారులు హోటల్ వద్దకు వచ్చి తమ అధినేతను కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించినా పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, శాంతియుతంగా పాదయాత్రకు వెళ్లబోతున్న సమయంలో ఈ తరహా నిర్భందాలు ఏమిటని పోలీసులను ప్రశ్నించారు.
శ్రవణ్‌కుమార్ వ్యక్తిగత సహాయకులను కూడా లోపలికి వెళ్లనీయకుండా హోటల్ బయట నిలువరించారు. ఏసీపీ రవికిరణ్ వచ్చిన తర్వాత హోటల్ బయట గుమిగూడిన పార్టీ మద్దతుదారులు, శ్రవణ్‌కుమార్ వ్యక్తిగత సహాయకులను బలవంతంగా అరెస్టు చేసి వివిధ పోలీసుస్టేషన్లకు తరలించారు. శ్రవణ్‌కుమార్ గది బయట పోలీసులు ఉండడంతో- విషయం తెలుసుకున్న శ్రవణ్‌కుమార్ గదిలోనే ఎక్కువ సేపు ఉన్నారు. నిర్ణీత సమయానికి పాదయాత్రకు బయలుదేరేందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని.. అయినా రైతులకు సంఘీభావం తెలిపేందుకు ఎలాంటి అవరోధాలు ఎదురైనా ముందుకు సాగాలని భావించి- హోటల్ గదిలో నుంచి బయటకు వచ్చిన వెంటనే పోలీసులు తమ అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం, పోలీసులు తీరుపై శ్రవణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించామని.. తన పాదయాత్రను అడ్డుకుని పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారన్నారు. ఆర్ 5 జోన్ పై ప్రభుత్వం దుర్మార్గంతో వ్యవహరిస్తోందన్నారు. రైతులకు సంఘీభావంగా పాదయాత్ర చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. హైకోర్టు జీవో1ని రద్దు చేసినా.. తనను ఎందుకు అరెస్టు చేస్తారని పోలీసులను నిలదీశారు. తన అక్రమ అరెస్టుకు నిరసనగా ఈక్షణం నుంచి తాను ఆమరణ నిరాహారదీక్షకు దిగుతున్నానని ప్రకటించారు. తనను స్టేషన్‌లో ఉంచినా.. జైలులో పెట్టినా ఎక్కడికి తీసుకెళ్లినా తన దీక్ష కొనసాగుతుందని పేర్కొన్నారు.
అక్రమ అరెస్టులపై ముఖ్యమంత్రి స్వయంగా స్పందించాలని డిమాండ్ చేశారు. ఇది ప్రజాస్వామ్యమా? రాచరికమా అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పాలన్నారు. రైతులకు మద్దతు ఇవ్వడం కూడా ఈ ప్రభుత్వంలో నేరమా అని నిలదీశారు. తనకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారని.. ఇవాల్టి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యిందన్నారు. శాంతియుత యాత్రకు కూడా వెళ్లనీయకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడుతుండగా కాసేపటి పోలీసులు బలవంతంగా జీపు ఎక్కించి తీసుకెళ్లారు. శ్రవణ్‌కుమార్‌తో పాటు ఆ పార్టీ విజయవాడ పశ్చిమ కన్వీనర్ పరసా సురేష్, తదితరులను పోలీసులు నున్న పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
జై భీం పార్టీ నేతల ఆందోళనలు: అమరావతి రైతులకు మద్దతుగా పాదయాత్రకు బయలుదేరిన జై భీమ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేయడంపై ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నున్న పోలీస్టేషన్ వద్ద జై భీమ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. పాదయాత్రకు వెళుతున్న జడ శ్రవణ్ కుమార్ అరెస్టు అన్యాయం అంటూ నినాదాలు చేశారు.
ఇవీ చదవండి: